డ్రగ్స్ బాధితులకు రీహాబ్ కేంద్రాలు: సీఎం రేవంత్
x

డ్రగ్స్ బాధితులకు రీహాబ్ కేంద్రాలు: సీఎం రేవంత్

మహిళల భద్రత, స్పందన టీమ్‌లు, డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభం.


డ్రగ్స్ బారిన పడిన వారిని తిరిగి సాధారణ జీవితం వైపు తీసుకురావడానికి పెద్ద ఎత్తున రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలు, పిల్లల రక్షణతో పాటు మత్తు పదార్థాల నియంత్రణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో స్పందన (తక్షణ రక్షణ) వాహనాలను సీఎం ప్రారంభించారు. అనంతరం నగర పోలీసులతో, పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళల భద్రతపై సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మహిళలు స్వేచ్ఛగా చదువు, ఉద్యోగం, వ్యాపారం చేయాలంటే భద్రత అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే షీ టీమ్స్, స్టాండ్ విత్ హర్ వంటి కార్యక్రమాలు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు స్పందన టీమ్‌లను ఏర్పాటు చేసి మరో అడుగు ముందుకు వేసినట్లు తెలిపారు.

ఈ టీమ్‌లు 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. బాధితుల దగ్గరకు వెళ్లి ముందుగా వారికి ధైర్యం చెప్పి, తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని వివరించారు. మహిళలపై వేధింపులను అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలు, పీస్ కమిటీలు కూడా భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు. సమస్యలు వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే నివారించే బాధ్యత సమాజంపై ఉందని గుర్తు చేశారు. డ్రగ్స్ సమస్యపై కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.

మత్తు పదార్థాల వల్లే చాలా నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. అందుకే ఈగల్ ఫోర్స్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. తెలియక ఈ బాట పట్టిన వారిని రీహాబ్ కేంద్రాల ద్వారా తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

మహిళల ఆర్థిక స్వావలంబనపై కూడా సీఎం ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతో మంజూరు చేయడం, స్వయం సహాయక సంఘాలకు భారీ రుణాలు అందించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు, మహిళా సంఘాల స్టాల్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను కూడా గుర్తుచేశారు. మహిళలు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More
Next Story