
తాతా మధును తొలగించాలి.. రేవంత్ కీలక డిమాండ్
స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో తాతా మధును ఎమ్మెల్సీగా తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో ఈ అంశంపై స్పందించిన రేవంత్ రెడ్డి.. తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని బీఆర్ఎస్‌ను డిమాండ్ చేశారు. స్పీకర్‌పై తాతా మధు ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయనతో రాజీనామా చేయించాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కోరారు. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది.
స్పీకర్ చైర్‌ను అవమానించడం తీవ్రమైన విషయమని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ఒక్క స్పీకర్‌కు జరిగిన అవమానం కాదని చెప్పారు. మొత్తం శాసనసభకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. స్పీకర్‌పై సభ్య సమాజం సహించలేని భాష వాడారని సీఎం మండిపడ్డారు. సభాపతి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్పీకర్ సభ్యుల హక్కులను కాపాడతారని, అలాంటి స్థానానికే అవమానం జరిగిందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాతా మధును బీఆర్‌ఎస్ నుంచి డిస్మిస్ చేయాలని కోరారు. ఆయనతో రాజీనామా చేయించాలని, లేదంటే బర్తరఫ్ చేయాలని అన్నారు. దళిత వ్యక్తిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోతున్నారంటూ బీఆర్‌ఎస్‌పై సీఎం విమర్శలు చేశారు. గతంలో దళితులకు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ తన వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్ తరాలు ఈ సభను క్షమించవని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో 22A అంశంపై బీజేపీ సభ్యుల ఆందోళనపైనా సీఎం స్పందించారు. చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భూముల వ్యవహారాలు, విద్యుత్ కొనుగోళ్లపై కూడా చర్చ తర్వాతే విచారణకు ఆదేశాలు ఇచ్చామని సీఎం చెప్పారు. చర్చ లేకుండానే కఠిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు.
బీజేపీ సభ్యులు తమ అంశాలను బీఏసీలో ప్రస్తావించాలని సూచించారు. షార్ట్ డిస్కషన్‌కు అవకాశం ఇస్తామని చెప్పిన తర్వాత కూడా ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు. సభలో సభ్యులకు ఏదైనా జరిగినప్పుడు వారిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ స్థానానికి ఉన్న గౌరవాన్ని అందరూ కాపాడాలని సూచించారు. ఈ అంశంపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని కోరారు.

