కేరళలో యూడీఎఫ్ విజయం పోరాటాల ఫలితమే: రేవంత్
x

కేరళలో యూడీఎఫ్ విజయం పోరాటాల ఫలితమే: రేవంత్

కేరళలో యూడీఎఫ్ విజయంపై రేవంత్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని అభినందిస్తూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విజయాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. యూడీఎఫ్ కూటమి సాధించిన విజయం కఠిన పోరాటం ఫలితమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కే.సి. వేణుగోపాల్, దీపా దాస్ మున్షి నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

కేరళ ప్రచార సమయంలో తనకు మద్దతుగా నిలిచిన యూడీఎఫ్ శ్రేణులు, రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తమపై చూపిన ప్రేమను ఎప్పటికీ మరచిపోనని, తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ప్రగతిశీల ఆలోచనలు, ప్రజాస్వామ్య విలువలు కలిగిన రాష్ట్రాలని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ఎదురైన నిరాశ తర్వాత ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విజయం రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దారిని చూపుతుందని ఆయన భావించారు.

ఈ సందర్భంగానే కేరళలో యూడీఎఫ్ విజయం సాధించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. యూడీఎఫ్ విజయానికి ఆయన వ్యూహాలు, ప్రచార శైలి ప్రధాన కారణమని చెప్పారు. కేరళ సీఎం విజయన్ విధానాలను సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నిస్తూ, తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉదాహరణగా చూపించారని అన్నారు. రుణమాఫీ, ఉచిత బస్సు, సన్న బియ్యం వంటి పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించారని తెలిపారు. సీపీఎం బీజేపీకి పరోక్ష మద్దతు ఇస్తోందని స్పష్టం చేసి, ప్రజలకు వారి బంధాన్ని తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఆదరణ ఉన్న నేతగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారని పేర్కొన్నారు.

Read More
Next Story