
మాట నిలబెట్టుకున్న రేవంత్
రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న రోడ్డులో సింగిల్ లైన్ విధానాన్ని అమలు చేయటంతో వాహనదారులు ఆశ్చర్యపోవటమే కాకుండా హ్యాపీగా ఫీలయ్యారు
హైదరాబాద్ నగరంలో వీవీఐపీల మూమెంట్ పెద్ద తలనొప్పిగా తయారైంది. ముఖ్యమంత్రి వస్తున్నారంటే ట్రాఫిక్ పోలీసులు గంటలసేపు ట్రాఫిక్ ను నిలిపేయటం కామన్ అయిపోయింది. దీనికి గురువారం ఫులుస్టాప్ పడింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈరోజు మధ్యాహ్నం శంషాబాద్ నుండి జూబ్లీహిల్స్ లోని తనింటికి వచ్చినపుడు పోలీసులు ఎక్కడా ట్రాఫిక్ ను ఆపలేదు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న రోడ్డులో సింగిల్ లైన్ విధానాన్ని అమలు చేయటంతో వాహనదారులు ఆశ్చర్యపోవటమే కాకుండా హ్యాపీగా ఫీలయ్యారు. మామూలుగా అ సీఎం వస్తున్నారంటే చాలా ముందునుండే పోలీసులు నాలుగువైపుల ట్రాఫిక్ ను నిలిపేస్తుంటారు. దాంతో ట్రాఫిక్ స్తింబించిపోయి వాహనదారులు నానా ఇబ్బందులు పడటం అందరికీ తెలిసిందే.
రెండు రోజుల క్రితం రేవంత్ జూబ్లీహిల్స్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళేటపుడు కూడా పోలీసులు అన్నీవైపులా ట్రాఫిక్ ను నిలిపేశారు. రేవంత్ ఇంటిదగ్గర బయలుదేరటం ఆలస్యమైనా పోలీసులు మాత్రం ట్రాఫిక్ ను అలాగే నిలిపుంచటంతో జూబ్లీహిల్స్-శంషాబాద్ రోడ్డుమార్గంలో పెద్ద గొడవైంది. అత్యవసరమైన పనులమీద వెళుతున్న వారిని కూడా పోలీసులు వదల్లేదు. ఈ విషయం శంషాబాద్ కు వెళుతున్న రేవంత్ దృష్టిలో పడింది. దాంతో స్పందించిన రేవంత్ ఇకనుండి తన కాన్వాయ్ కోసం రెగ్యులర్ ట్రాఫిక్ ను ఆపద్దని డీజీపీతో పాటు ట్రాఫిక్ ఉన్నతాధికారులను కూడా ఆదేశించారు. తన కాన్వాయ్ వల్ల మామూలు జనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇబ్బందులు పడటం తనకు ఏమాత్రం ఇష్టంలేదని స్పష్టంగా చెప్పారు.
ఫలితంగా ఈరోజు మధ్యాహ్నం రేవంత్ ఢిల్లీనుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని జూబ్లీహిల్స్ కు బయలుదేరారు. రేవంత్ కాన్వాయ్ కు ఒక లైన్ ను కేటాయించిన పోలీసులు మిగలిన ట్రాఫిక్ ను వదిలేశారు. దాంతో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ఒకవైపు రేవంత్ వెళుతున్నా పోలీసులు మిగిలిన ట్రాఫిక్ ను ఆపకుండా వదిలేయటంతో వందలాది వాహనాదారులు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మండుతున్న ఎండల్లో ట్రాఫిక్ లో నిలబడిపోవటం అంటే ఎంత నరకమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. రెగ్యులర్ ట్రాఫిక్ లోనే రేవంత్ కూడా ప్రయాణించటంతో తన మాట నిలబెట్టుకున్నట్లయ్యింది.

