
మెట్రో ఫేజ్-2పై కేంద్ర మంత్రితో రేవంత్ భేటీ..
హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఆమోదం కోరుతూ సీఎం ఢిల్లీలో కేంద్ర మంత్రితో కీలక చర్చలు జరిపారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిర్మాణ పనులపై కేంద్ర పట్టణ వ్యవహరాల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఏడు కారిడార్లతో మెట్రో ఫేజ్-2కు సంబంధించి డీపీఆర్‌ను కూడా కేంద్రానికి సమర్పించామని రేవంత్ గుర్తు చేశారు. ఈ భేటీలో మెట్రో విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికలను సీఎం వివరించారు. మొత్తం 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించే ప్రణాళిక ఉందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,595 కోట్లుగా ఉందని వివరించారు.
పెరుగుతున్న ట్రాఫిక్, నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని మెట్రో విస్తరణ అత్యవసరమని సీఎం కేంద్ర మంత్రికి తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రజల ప్రయాణ సౌకర్యాల కోసం ఈ ప్రాజెక్టు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును కేంద్రం-రాష్ట్రం కలిసి జాయింట్ వెంచర్‌గా అమలు చేయాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో మెట్రో ఫేజ్-3 ప్రణాళికపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీకి ప్రత్యేక కారిడార్ ప్రతిపాదనను సీఎం ప్రస్తావించారు. ఇప్పటికే మెట్రో ఫేజ్-1 ప్రభుత్వ ఆధీనంలోకి రావడంతో, తదుపరి విస్తరణ పనులు సులభమవుతాయని సీఎం వివరించారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న రవాణా అవసరాల నేపథ్యంలో మెట్రో విస్తరణపై ఈ భేటీ కీలకంగా మారింది. కేంద్రం స్పందనపై తదుపరి చర్యలు ఆధారపడనున్నాయి.

