
కలిసి పనిచేస్తేనే రక్షణ రెట్టింపు: రేవంత్
దక్షిణ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా మార్చేందుకు రాష్ట్రాల పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
నేరాలను నియంత్రించడం అన్ని రాష్ట్రాల సమన్వయంతోనే సాధ్యమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనకున్న సొంత వనరులతో ప్రయత్నించినా నేరాలను నియంత్రించడం సాధ్యం కాదని, కొంత వరకు మాత్రమే ప్రభావం ఉంటుందని వివరించారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల పోలీసు శాఖలు ఏకం కావాలని, దక్షిణాదిని దేశంలోనే సురక్షితమైన ప్రదేశంగా మార్చాలని పిలుపునిచ్చారు. నేరాలను తగ్గించేందుకు రాష్ట్రాల మధ్య సరిహద్దులు దాటి సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. పోలీసింగ్‌లో తెలంగాణ అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను ఇతర రాష్ట్రాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ (SRPCC) సదస్సును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు వ్యవస్థలో వస్తున్న మార్పులు, నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, రాష్ట్రాల మధ్య సహకారం వంటి అంశాలపై మాట్లాడారు. ప్రతి రాష్ట్రం తన సొంత వనరులతోనే నేరాలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని చెప్పారు. నేరాల రేటును సాధ్యమైనంత తక్కువ స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
మారుతున్న నేరాల స్వభావానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ట్రాఫిక్ సమస్యలు ప్రస్తుతం ప్రధాన సవాళ్లుగా మారాయని తెలిపారు. వీటిని ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక విభాగాలు, సిబ్బందికి శిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు పోలీసు వ్యవస్థ నుంచి భద్రతతో పాటు నిష్పాక్షికమైన, నైతిక విలువలతో కూడిన సేవలను ఆశిస్తారని సీఎం చెప్పారు. పోలీసు శాఖకు ప్రభుత్వం అందించే వనరులను ఖర్చుగా కాకుండా, ప్రజల భద్రతకు, మెరుగైన సమాజ నిర్మాణానికి పెట్టుబడిగా చూస్తున్నట్లు వివరించారు. అందుకే పోలీసింగ్‌లో అవసరమైన సంస్కరణలను నిరంతరం చేపట్టాలని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు మార్పులు తీసుకొచ్చినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు పోలీసు కమిషనరేట్లుగా విభజించినట్లు చెప్పారు. దీనివల్ల ఆయా ప్రాంతాలపై కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఏర్పడిందని వివరించారు. నేరాల స్వభావాన్ని బట్టి ప్రత్యేకంగా పనిచేసేందుకు హైడ్రా, ఈగల్, టీ-సేఫ్ వంటి విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటితో పాటు పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచుతున్నామని చెప్పారు.
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నిర్వహించిన ప్రగతి సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని నక్సల్స్ రహితంగా మార్చేందుకు కృషి చేసిన తెలంగాణ పోలీసు అధికారులను కేంద్ర హోంమంత్రి అభినందించినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ విభాగం పనితీరుకు కేంద్ర ప్రభుత్వం 80 శాతానికి పైగా మార్కులు ఇచ్చినట్లు సీఎం వివరించారు. సైబర్ నేరాల్లో బాధితులు కోల్పోయిన డబ్బును తిరిగి అందించే విషయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక ఫలితాలు సాధిస్తోందని చెప్పారు.
ఆహార కల్తీని అరికట్టడం, ఔషధాల నియంత్రణను బలోపేతం చేయడం కోసం అమెరికాలోని ఎఫ్‌డీఏ తరహాలో సమన్వయంతో పనిచేసే టీ-సేఫ్ (TG-SAFE) విభాగాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చెరువులు, జలవనరులను కాపాడటం, వాటిని పునరుద్ధరించడం, ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం కోసం హైడ్రా పనిచేస్తోందని సీఎం చెప్పారు. ఈ చర్యల ద్వారా జలవనరులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించడం ద్వారా తెలంగాణ దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వారి పిల్లల భవిష్యత్తు ఒక ప్రధాన సమస్యగా ఉంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసు కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు హైదరాబాద్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
హోంగార్డు నుంచి డీజీపీ వరకు అన్ని స్థాయుల్లో పనిచేసే పోలీసు సిబ్బంది పిల్లలకు ఈ పాఠశాలలో చదివే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దేశంలోని అత్యుత్తమ సైనిక్ పాఠశాలలకు ధీటుగా విద్య అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటోందని సీఎం చెప్పారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారి వరకు, హోదా, సర్వీసును బట్టి కనీసం రూ.కోటి నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నట్లు వివరించారు.

