ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్.. గెలుపు మీ పనితీరుతోనే!
x

ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్.. గెలుపు మీ పనితీరుతోనే!

కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అసెంబ్లీకి పూర్తి హాజరు, ప్రజా సమస్యలపై చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు.


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరే వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అసెంబ్లీలో చురుగ్గా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే అంశాలపైనా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ జరిగే అన్ని రోజులు సభ్యుల హాజరు పూర్తి స్థాయిలో ఉండాలని సూచించారు. తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చిన పదవిని సరిగ్గా ఉపయోగించుకోవాలని రేవంత్ సూచించారు. వ్యక్తిగత పనితీరు బాగుంటేనే రాజకీయంగా మరోసారి గెలిచే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పనితీరులో నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇక ఓటు హక్కు పరిరక్షణ అంశంపైనా ఎమ్మెల్యేలకు సీఎం కీలక సూచన చేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని భావించే ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశానికి ఒక నమూనాగా నిలపాలని సీఎం అన్నారు. తెలంగాణ మోడల్‌లో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ వ్యూహాలను తిప్పికొట్టిన ఎమ్మెల్యేలను రేవంత్ అభినందించారు. ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించేలా కార్యాచరణ చేపట్టాలని చెప్పారు.

Read More
Next Story