
ప్రతి ఆరు నెలలకు పోటీ పరీక్షలు.. సీఎం రేవంత్ కీలక హామీ
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రతి ఆరు నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువత పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రభుత్వంలోని ప్రతి ఖాళీని భర్తీ చేయడమే లక్ష్యమని చెప్పారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
పేదలకు సన్నబియ్యం పంపిణీ
పేదలు ఆకలితో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేపట్టామని సీఎం తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3.42 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నట్లు చెప్పారు. సన్నబియ్యం పంపిణీ మొదలైన తర్వాత మార్కెట్‌లో వాటి ధర రూ.10 నుంచి రూ.15 వరకు తగ్గిందని పేర్కొన్నారు.
రైతులకు రూ.1.70 లక్షల కోట్ల ఖర్చు
వ్యవసాయాన్ని పండుగలా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంపై రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. గత 32 నెలల్లో రైతులు పండించిన పంటల కొనుగోలుకు రూ.90 వేల కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రూ.21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులను రుణభారం నుంచి విముక్తి చేశామని తెలిపారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని చెప్పారు.
పంట రుణాల మాఫీ ద్వారా రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించినట్లు మరోసారి వివరించారు. యాసంగి సీజన్‌లో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చినట్లు చెప్పారు.
మహిళలకు ప్రాధాన్యం
మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రుణాల కింద బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60 వేల కోట్లకు పైగా అందించినట్లు చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 335 కోట్లకు పైగా ప్రయాణాలు జరిగాయని చెప్పారు. 27 లక్షల మంది విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లకు ప్రాధాన్యం
పేదలకు ఇల్లు అనేది కేవలం గోడలు, పైకప్పు కాదని.. అది ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లను, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు చెప్పారు. గిరిజనులు, ముఖ్యంగా చెంచు తెగతో పాటు అత్యంత వెనుకబడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
సంక్షేమ పథకాలపై సీఎం వివరణ
సంక్షేమ పథకాలను ప్రభుత్వ ఖర్చుగా మాత్రమే చూడకూడదని సీఎం అన్నారు. ప్రజలకు గౌరవంగా జీవించే అవకాశం కల్పించడమే సంక్షేమం లక్ష్యమని వివరించారు. గృహజ్యోతి పథకం కింద 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 10.97 కోట్ల జీరో బిల్లులు జారీ చేసినట్లు చెప్పారు. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద రూ.4,709 కోట్లు ఖర్చు చేసి 1.68 లక్షల మంది మహిళలకు సాయం చేసినట్లు చెప్పారు.
ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
నిరుద్యోగ యువతను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం అన్నారు. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఇటీవల మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వంలోని ఏ ఖాళీని వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఆరు నెలలకు పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అన్ని పరీక్షలను నిర్వహించే బాధ్యత తనదేనని చెప్పారు. యువత పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు.
రూ.75 వేల కోట్ల అప్పుల చెల్లింపులు
గత ప్రభుత్వంలో చేసిన అప్పులు, తప్పుల ప్రభావం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి ఏడాది రూ.75 వేల కోట్లను అప్పుల చెల్లింపులకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సంక్షోభంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రం ముందుకు వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931గా ఉందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు 91 శాతం ఎక్కువని ఆర్‌బీఐ నివేదిక ఆధారంగా చెప్పారు. గత 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు.
రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల వాటా కోసం వెనక్కి తగ్గబోమని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు మంచి పాలన అందించడం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని సీఎం చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, మహిళల సాధికారత, పేదల గృహ నిర్మాణం వంటి అంశాలపై ప్రభుత్వం తన కార్యాచరణను కొనసాగిస్తుందని తెలిపారు.

