
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం: రేవంత్
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లపై సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కొనుగోళ్లో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సంహించేది లేదని స్పస్టం చేశారు. అధికారులు జాగ్రత్తగా కొనుగోళ్లను జాగ్రత్తగా చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా గోదాములకు తరలించాలని సీఎం చెప్పారు. లారీలు అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ధాన్యం రవాణాకు కావాల్సిన వాహనాలు సరిపడా ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌కు సీఎం ఆదేశాలు ఇచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
ప్రతి అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సీఎం తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే కలెక్టర్లపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు వెనకాడదని హెచ్చరించారు. గోదాముల సమస్య ఉన్న ప్రాంతాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాల్స్‌ను వినియోగించి ధాన్యాన్ని నిల్వ చేయాలని చెప్పారు. అక్కడి నుంచి అవసరాన్ని బట్టి గోదాములకు తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. ఎక్కడా రైతులు ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకుని కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. కొనుగోళ్ల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సీఎస్‌కు నివేదికలు పంపించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

