కూలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించబోతున్న రేవంత్
x

కూలేశ్వరం ప్రాజెక్టును పరిశీలించబోతున్న రేవంత్

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపరభగీరథుడు కేసీఆర్ ప్రత్యేకశ్రద్ధతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తన హయాంలోనే కూలిపోయిన విషయం తెలిసిందే


కూలేశ్వరం ప్రాజెక్టును మొదటిసారి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. ఈనెల 20వ తేదీన జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్ మండలం మేడిగడ్డలో నిర్మించిన కూలేశ్వరం(కాళేశ్వరం) బ్యారేజీని పరిశీలించబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అన్నది రేవంతే అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే సుందిళ్ళు, అన్నారం బ్యారేజీల పునరుద్దరణ పనుల గురించి కూడా సంబంధిత అధికారులతో ప్రాజెక్టు దగ్గరే సమీక్ష చేయబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. గతంలో కూడా రేవంత్ ప్రాజెక్టును సందర్శించాడు. అయితే అప్పట్లో ఎందుకు సందర్శించాడంటే దెబ్బతిన్న బ్లాకులు, పిల్లర్లను పరిశీలించేందుకు వెళ్ళాడు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, నీటిపారుదల నిపుణుల బృందాన్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఇపుడు వెళ్ళబోతున్నది ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల పరిశీలన కోసం.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో అపరభగీరథుడు కేసీఆర్ ప్రత్యేకశ్రద్ధతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తన హయాంలోనే కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు కూలిపోయిందంటే మట్టితో కట్టిన ఇల్లు వర్షాలదెబ్బకు కూలిపోయినట్లు కాదు. భారీవర్షాల దెబ్బకు ప్రాజెక్టులోని 6,7,8 బ్లాకులోని కొన్ని పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. భారీవర్షాల కారణంగా కిందున్న ఇసుక కొట్టుకుపోవటంతో పిల్లర్ల కిందున్న ఇసుక కూడా కొట్టుకుపోయింది. ఎప్పుడైతే పిల్లర్ల కిందున్న ఇసుక కొట్టుకుపోయిందో వెంటనే డ్యామ్‌ ప్లాట్‌ఫామ్ భారాన్ని మోయలేక పిల్లర్లు మరింత కిందకు కుంగిపాయాయి. ఎప్పుడైతే కొన్ని పిల్లర్లు కిందకు కుంగిపోయాయో డ్యామ్ ప్లాట్ ఫామ్‌కు పగుళ్ళొచ్చేశాయి.

ఇటు పిల్లర్లు చీలిపోయి, అటు డ్యామ్ ప్లాట్ ఫామ్ కు పగుళ్ళు వచ్చేయటంతో ప్రాజెక్టు నీటినిల్వకు పనికిరాకుండా పోయింది. ఫలితంగా రెండున్నరేళ్ళుగా ప్రాజెక్టులో నీటిని ఉన్నతాధికారులు నిల్వ ఉంచటంలేదు. వచ్చిన నీటిని వచ్చినట్లు బయటకు వదిలేస్తున్నారు. అందుకనే దాదాపు రు. 1.57 లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం పనికిరాకుండా పోయింది. అందుకనే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటున్నది. కాళేశ్వరమే కాకుండా దీనికి అనుబంధంగా నిర్మించిన సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల నిర్మాణం కూడా నాసిరకమే అని నిపుణులు తేల్చేశారు. దాంతో మూడు ప్రాజెక్టులు నీటి నిల్వకు పనికిరాకుండా పోయాయి.

కుంగిపోయిన పిల్లర్లకు, పగొళ్ళొచ్చేసిన డ్యామ్ ప్లాట్ ఫామ్ కు నాలుగు తట్టల సిమెంట్, ఇసుకతో రిపేర్లు చేయిస్తే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇరిగేషన్ శాఖకు మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు చెప్పటమే విచిత్రం. నిజంగానే నాలుగు తట్టల సిమెంట్, ఇసుకతో రిపేర్లు చేయించేపనైతే ఆ పనిని తమ హయాంలోనే కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు ? డ్యామ్ వినియోగానికి పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి, సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులతో పాటు ఎంతోమంది ఇరిగేషన్ నిపుణులు తేల్చేశారు. దీనికి రిపేర్లుచేసినా ఎంతకాలం మన్నుతుంది అన్నది అనుమానమే. ఒకవేళ రిపేర్లు చేయాలంటే వేలాది కోట్ల రూపాయలు ఖర్చుచేయక తప్పదు.

ఈమ్యనే నిపుణులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం డ్యామ్ వినియోగంలోకి రావాలంటే ముందు కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మించాలని. కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్ నిర్మాణానికి సుమారు 1500 కోట్ల రూపాయలు, కుంగిపోయిన పల్లర్లు, పగుళ్ళిచ్చేసిన డ్యామ్ ప్లాట్ ఫామ్ మరమ్మత్తులకు మరో వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అంచనా వేశారు. అంటే సుమారు రు. 2500 కోట్లు ఖర్చుపెడితే కాని కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చేందుకు లేదు. ఇంతచేసినా ప్రాజెక్టు గట్టిగా నిలబడుతుందా అంటే అనుమానమే అంటున్నారు నిపుణులు.

ఇంతటి భారీ ఖర్చును ఎవరు చేయాలి ? నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్ధే భరించాలి. అయితే ఎల్ అండ్ టీ ఏమో తనకు రిపేర్ల ఖర్చుతో సంబంధంలేదని అంటున్నది. ప్రభుత్వమేమో నిర్మాణంతో పాటు నిర్వహణ కాలపరిధిలోనే డ్యాంకు రిపేర్లు వచ్చాయి కాబట్టి మొత్తం ఖర్చును సంస్ధే భరించాలని స్పష్టంచేసింది. అయినా నిర్మాణ సంస్ధ మొండికేస్తోంది. ఇన్ని వివాదాల మధ్య రేవంత్ 20వ తేదీన నేరుగా ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. మరి అప్పుడు ఏమి చెబుతారో చూడాలి.

Read More
Next Story