ప్రాణహిత ప్రాజెక్టుకు పునర్జీవం:నాలుగు ప్రతిపాదనలపై ప్రభుత్వ పరిశీలన
x
ప్రాణహిత ప్రాజెక్టుపై అధిాకరులతో చర్చిస్తున్న మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాణహిత ప్రాజెక్టుకు పునర్జీవం:నాలుగు ప్రతిపాదనలపై ప్రభుత్వ పరిశీలన

తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు.. లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం


ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టు అమలుకు ప్రణాళికలు సిద్ధం చేసి, తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే దిశగా కీలక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.తుమ్మడిహట్టి నుంచి ఎల్లంపల్లికీ నీటిని తరలించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.బుధవారం మంత్రి నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్ సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్ ఇ.ఎన్.సి రమేష్ బాబు,జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రోహిత్ శర్మ,ఆర్వీ అసోసియేట్స్,ఐఐటీ హైదరాబాద్ ప్రతినిధులతో సమీక్షించారు.


నాలుగు ప్రతిపాదనలు పరిశీలనలో...

తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికీ నీటిని తరలించేందుకు వీలుగా ఆర్వీ అసోసియేట్స్ ,హైదరాబాద్ ఐ ఐ టి సమిష్ఠిగా నాలుగు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది.ప్రతీ ప్రతిపాదనకు అయ్యే ఖర్చు,అనుకూల ,ప్రతీ కూలతలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తో జరగనున్న సమీక్షా సమావేశంలో సమీక్షించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.

మేడిగడ్డ పునరుద్ధరణ పనులపై సమీక్ష

మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణ పనులపై బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పునరుద్ధరణ కు అవసరమైన పరీక్షలను వర్షాకాలం లోపు పూర్తి చేయాలని, ప్రతీ 1.5 మీటర్ల దూరంలో ఎస్.పి.టి టెస్ట్ లు నిర్వహించాలని మంత్రి సూచించారు. బ్యారేజ్ ల పునరుద్ధరణ కోసం నియమించిన సమన్వయ కమిటీ బ్యారేజ్ లను సందర్శించి టైంలైన్ ను ఫిక్స్ చేసుకోవాలని,పునరుద్ధరణకు అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. అదే సమయంలో బ్యారేజీల పునరుద్ధరణ కోసం జరుగుతున్న పరీక్షల పురోగతి పనుల వివరాలు ఎప్పటికప్పుడు ఎన్టీఎస్ఏకు నివేదించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖా కార్యదర్శిని ఆదేశించారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి సాగునీటి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, బ్యారేజీల మరమ్మతులను సమాంతరంగా పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణను మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.


Read More
Next Story