హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్
x

హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్

ఏఐ–హెల్త్‌టెక్ భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ముందడుగు


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హెల్త్‌టెక్ రంగంలో తెలంగాణను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత హెల్త్‌టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్, తెలంగాణతో కలిసి పనిచేయాలనే ఆసక్తి వ్యక్తం చేస్తూ, హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై చర్చలు ప్రారంభించింది.

ప్రపంచ ఆర్థిక వేదిక–2026 వార్షిక సమావేశాల సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కేజ్రోండ్ భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ‘నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’పై వివరాలు పంచుకున్నారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగాన్ని 250 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి రంగాల్లో ప్రపంచ స్థాయి పారిశ్రామిక క్లస్టర్ తెలంగాణలో రూపుదిద్దుకుంటోందన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ దృష్టితో ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి–అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తూ, మాన్యుఫాక్చరింగ్, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త ఊపునిస్తున్నామని చెప్పారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే ప్రణాళికలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ దిశగా తీసుకొచ్చిన కొత్త పాలసీ వ్యూహాత్మక మలుపుగా మారిందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేలకుపైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్–మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్, బలమైన హెల్త్‌కేర్–ఐటీ టాలెంట్ బేస్ తెలంగాణ బలమని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాదు ఇప్పటికే హెల్త్ టూరిజం కేంద్రంగా ప్రపంచ గుర్తింపు సంపాదించిందని, ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్, అంబులెన్స్ సేవల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోందని పేర్కొంది.

హైదరాబాద్‌ను భవిష్యత్తులో ఏఐ సిటీగా అభివృద్ధి చేసే కీలక సమయంలో రాయల్ ఫిలిప్స్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ముందుకు రావడం పెట్టుబడుల ఆకర్షణకు మరింత బలాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా జాన్ విల్లెమ్ స్కేజ్రోండ్‌ని జీనోమ్ వ్యాలీ సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

ఫిలిప్స్ గ్లోబల్ హెడ్ జాన్ విల్లెమ్ స్కేజ్రోండ్ మాట్లాడుతూ, తెలంగాణలో అమలవుతున్న ఏఐ ఆధారిత ఆరోగ్య కార్యక్రమాలను ప్రశంసించారు. రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. నెదర్లాండ్స్‌లోని ఫిలిప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాల్సిందిగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందానికి ఆయన ఆహ్వానం పలికారు.

Read More
Next Story