
మెట్రో ఫేజ్-2పై ఆర్ఆర్‌టీఎస్ నీడలు..
కేంద్రం కొత్త రైలు ప్రాజెక్ట్ సూచనతో నగర రవాణా ప్రణాళికలపై చర్చ కొనసాగుతోంది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అంశంపై ఇప్పుడు ఆర్ఆర్‌టీఎస్(Rapid Rail Transit System) నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్-2 ప్లాన్స్‌ను కేంద్రానికి పంపినా ఇప్పుడు ఆర్ఆర్‌టీఎస్ ప్రతిపాదనలు రావడంతో సందిగ్ధం ఏర్పడింది. ఈ నూతన ప్రతిపాదనతో మెట్రో ఫేజ్-2 అమలు ముందుకు సాగుతుందా, లేక ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అమలు అవుతుందా అన్న దానిపై అనిశ్చితి పెరిగింది. రాష్ట్రం మెట్రో రెండో దశకు సిద్ధమవుతున్న సమయంలో కేంద్రం ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్‌ను సూచించింది.
తక్కువ ఖర్చుతో, వేగవంతమైన ప్రయాణం అందించవచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న మెట్రో కంటే ఇది వేగంగా నడుస్తుందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్‌ను లార్సెన్ అండ్ టుబ్రో నుంచి స్వాధీనం చేసుకుంది. అదే సమయంలో ఫేజ్-2 ప్రణాళికలను కూడా ముందుకు తీసుకెళ్తోంది. మెట్రో ఫేజ్-2కు సంబంధించిన డీపీఆర్‌లను రాష్ట్రం కేంద్రానికి పంపింది. అయితే అవి ఆమోదం పొందుతాయా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. కేంద్రం ఆర్ఆర్టీఎస్ వైపు మొగ్గు చూపుతుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
8 కారిడార్లతో మెట్రో విస్తరణ
మెట్రో ఫేజ్-2లో మొత్తం 8 కారిడార్లతో 76.4 కిలోమీటర్ల విస్తరణ ప్రణాళిక ఉంది. ఇందులో నాగోల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు 36.8 కి.మీ, రాయదుర్గం నుంచి కోకాపేట్ వరకు 11.6 కి.మీ, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ ఉన్నాయి. అలాగే మియాపూర్ నుంచి పటాన్‌చేరు 13.4 కి.మీ, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ 7.1 కి.మీ మార్గాలు కూడా ఉన్నాయి. ఇక అదనంగా 86.1 కి.మీ మేర మరికొన్ని మార్గాలు ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ 39.6 కి.మీ, జేబీఎస్ నుంచి మెడ్చల్ 22 కి.మీ, జేబీఎస్ నుంచి షామీర్‌పేట్ 22 కి.మీ ఉన్నాయి.
భారీగా ఖర్చు
మెట్రో ఫేజ్-2కు సుమారు 48 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. మొదటి దశ కొనుగోలుకు మరో 15 వేల కోట్లు కలిపితే మొత్తం వ్యయం 63 వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ నిధులను జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 2 శాతం వడ్డీతో సమీకరించాలనే యోచన ఉంది. జైకాతో ప్రాథమిక ఒప్పందం కూడా కుదిరింది.
ఆర్ఆర్టీఎస్ ప్రత్యేకతలు
ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్‌ను 192.2 కిలోమీటర్ల మేర అమలు చేయవచ్చని కేంద్రం సూచించింది. అదే 48 వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయవచ్చని తెలిపింది. ఈ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. ఆర్ఆర్టీఎస్‌లో యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఇది ప్రస్తుత మెట్రో సిగ్నలింగ్ కంటే ఆధునికమైనది. ఇప్పటికే ఢిల్లీ-మీరట్ మధ్య ‘నమో భారత్’ పేరుతో ఈ సేవలు నడుస్తున్నాయి.
ఆర్ఆర్‌టీఎస్ ముందున్న సవాళ్లు
పటాన్‌చేరు–లక్డీకాపూల్–ఆరంఘర్, రాయదుర్గం–కోకాపేట్, ఎల్బీనగర్–హయత్‌నగర్, ఎంజీబీఎస్–చంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్ట్–ఫ్యూచర్ సిటీ, జేబీఎస్–మెడ్చల్, జేబీఎస్–షామీర్‌పేట్ మార్గాల్లో ఆర్ఆర్టీఎస్ ప్రతిపాదించారు. అయితే ఈ మార్గాల్లో ఫ్లైఓవర్లు ఎక్కువగా ఉండటంతో నిర్మాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని మెట్రో అధికారులు భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా భూగర్భ మార్గాలను నిర్మించాలని కేంద్రం సూచించింది.

