
మీర్ పేటలో బోర్డు తిప్పేసిన చిటీఫండ్
రూ.2 కోట్ల వరకు మోసం
హైదరాబాద్ మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగుచూసింది. భార్యభర్తలిద్దరూ కలిసి చిటీల పేరుతో ప్రజలను మోసం చేశారు. దాదాపు రూ.2కోట్లు కూడబెట్టుకున్నాక అందరినీ మోసం చేస్తూ చిటీల కంపెనీ బోర్డ్ తిప్పేశారు. చిట్టీలు వేసిన వారికి రేపు ఇస్తా మాపు ఇస్తా అని చెప్పిన వెంకట సాయి చిట్ ఫండ్ నిర్వాహకులు ప్రజలను నట్టేట ముంచారు. గత పదేళ్లుగా మీర్ పేట వైష్ణవి కాలనీ ప్రెసిడెంట్ సురేష్, అతని భార్య కలిసి చిటీలను నిర్వహిస్తున్నారు.
కాలనీ వాసుల చేత, చుట్టుపక్కల వారి చేత చిటీలు వేయించారు. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు అందాక ఒక్కసారిగా బోర్డు తిప్పేసి కాలనీ వాసులను మోసం చేయడంతో బాధితులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. దాదాపు రెండుకోట్లు మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఒక్కో సభ్యుడి నుంచి రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు. సురేష్ దంపతులపై నమ్మకంతో తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టి చిట్టీలు వేశామని బాధితులు వాపోతున్నారు.
గడువు ముగిసినా సురేష్ దంపతులు తమకు ఇవ్వాల్సిన చిటీ మొత్తాన్ని చెల్లించక పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా సురేష్ దంపతులు బాధితులకు చెల్లని చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇవ్వడంతో బాధితులు రోడ్డున పడ్డారు. దాదాపు 25 మందికి పైగా మోసపోయినట్టు తెలుస్తోంది. తమ డబ్బులు తమకు ఇవ్వాలని బాధితులు నిలదీస్తే.. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని తెగేసి చెప్తున్నారని, దాంతో తాము పోలీసులను ఆశ్రయించామని బాధితులు చెప్పారు.
అయితే చిట్ ఫండ్ కంపెనీ ఇంతవరకు రిజిస్టర్ కాలేదని పోలీసులు తెలిపారు. పోలీసు కేసవడంతో సురేష్ దంపతులు పాలాయనమంత్రం పటించారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

