రూ.5 కోట్లు డిమాండ్? పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు!
x

రూ.5 కోట్లు డిమాండ్? పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు!

అత్యాచార కేసు ఎఫ్‌ఐఆర్ రద్దుకు రూ.5 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలు పంజాబ్‌లో కలకలం రేపుతున్నాయి. సీఎం భార్య పేరు రావడంతో NHRC రంగంలోకి దిగింది.


Click the Play button to hear this message in audio format

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ కౌర్ పేరు ఓ అత్యాచార కేసు వ్యవహారంలో తెరపైకి రావడం రాజకీయంగా, న్యాయపరంగా కలకలం రేపుతోంది. ఎఫ్‌ఐఆర్‌ రద్దుకు ఆమె తన రాజకీయ పలుకుబడి ఉపయోగించారని, అందుకు రూ.4 కోట్ల నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందించింది.

అసలు కేసేమిటి?

అమృత్‌సర్‌లో ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అపహరించి అత్యాచారం చేశాడని గురిందర్ సింగ్ అలియాస్ గురి చహల్‌పై ఆమె తండ్రి ఆరోపించారు. తన కుమార్తె వ్యక్తిగత ఫొటోలు చహల్ వద్ద ఉన్నాయని, వాటిని ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేశాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్ 29న కేసు నమోదు కాగా.. మే 1న యువతిని పోలీసులు గుర్తించి రక్షించారు. మే 13న చహల్‌ను అరెస్టు చేశారు. అయితే పోలీసులు దర్యాప్తును సరిగా చేయలేదని, నిందితుడిని జైలు నుంచి విడుదల చేశారని యువతి తండ్రి ఆరోపించారు.

చహల్ స్నేహితుడు సిమ్రన్‌జిత్ సింగ్ హుండల్, సీఎం భార్యకు సన్నిహితుడిగా పేరున్న అమర్‌దీప్ సింగ్ గ్రెవాల్ పేర్లు ఈ కేసులో ప్రస్తావనకు వచ్చాయి. ఆరోపణలపై విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని పంజాబ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని కమిషన్ ఆదేశించింది. ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖలోని మహిళా భద్రత విభాగానికి సైతం పంపింది. అయితే.. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైకోర్టు ఏం చెప్పింది?

కేసు దర్యాప్తుపై అనుమానాలున్నా.. సీబీఐ విచారణకు అప్పగించాలన్న డిమాండ్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు తిరస్కరించింది. అయితే స్థానిక పోలీసులపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తునకు కొత్త అధికారిని నియమించాలని ఆదేశించింది. ఈ కేసుతో గతంలో ఎలాంటి సంబంధం లేని సీనియర్ పోలీసు అధికారిని నియమించి, రాష్ట్ర స్థాయి సీనియర్ అధికారి పర్యవేక్షణలో విచారణ కొనసాగించాలని జస్టిస్ మన్‌దీప్ పన్ను ఆదేశించారు. అయితే ఈ ఆరోపణలపై గుర్‌ప్రీత్‌ కౌర్‌ అధికారికంగా స్పందించలేదు.

మొత్తంగా.. ఈ వ్యవహారంలో రూ.5 కోట్ల డిమాండ్, రాజకీయ జోక్యం, పోలీసు దర్యాప్తు, సీఎం భార్య పేరు వంటి అంశాలు వివాదానికి కేంద్రంగా మారాయి. అయితే ఇప్పటివరకు వచ్చినవి ప్రధానంగా పిటిషన్లలోని ఆరోపణలే. వాటి నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read More
Next Story