
సమావేశంలో ప్రాజెక్టు గురించి చర్చిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు
సమ్మక్క–సారక్క బ్యారేజ్ సర్వేకు రూ.9.8కోట్లు
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక భేటీ
గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క బ్యారేజ్, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌కు వచ్చిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తో హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారుల బృందంతో కలిసి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన సమ్మక్క–సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు.
ఛత్తీస్‌గఢ్ సీఎంకు మంత్రి వినతి
ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తుది పరిశీలనకు తీసుకెళ్లేందుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక విజ్ఞాపన పత్రాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి సమర్పించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జలాల వినియోగం, పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి, రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడం వంటి అంశాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అనుమతులు వచ్చాయ్
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి గారు తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని, అంశాన్ని సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పరిణామం సమ్మక్క–సారక్క ప్రాజెక్టు అనుమతుల ప్రక్రియలో కీలక మలుపుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.కేంద్ర జల సంఘంలోని అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి ప్రాజెక్టుకు ఇప్పటికే అనుమతులు లభించాయని మంత్రి వెల్లడించారు.
ఇరు రాష్ట్రాల సంయుక్త సర్వే
ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని మంత్రి తెలిపారు. మరింత ఖచ్చితమైన సర్వే కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందన్నారు. సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లను 2026 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్లు ఆయన వివరించారు.ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావిత భూములు గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే పరిహార మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేసేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story

