
ఆర్టీసీ బలోపేతం మా లక్ష్యం: పొన్నం
ఆర్టీసీ కార్మిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. పీఆర్సీ, విలీనం, సంక్షేమంపై కీలక నిర్ణయాలు వెల్లడించారు.
తెలంగాణ ఆర్టీసీ బలోపేతంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శనివారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆర్టీసీ భవితవ్యం, బలోపేతంపై మాట్లాడారు. రెండు రోజుల సమ్మె సమయంలో కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపినట్టు చెప్పారు. వారి ప్రధాన డిమాండ్లకు పరిష్కారం చూపినట్టు వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కార్మికుల చిరకాల కోరిక అని, దాన్ని నెరవేర్చామని తెలిపారు. 11 శాతం పీఆర్సీ ప్రకటన, యూనియన్ ఎన్నికలపై కూడా సిబ్బంది సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఈ నిర్ణయాలను చారిత్రాత్మకంగా భావించి కార్మికులు సంబరాలు జరుపుతున్నారని పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల బృందం సుమారు 15 గంటల పాటు చర్చలు జరిపిందని తెలిపారు. ఇంకా మిగిలిన సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. గతంలో జరిగిన సమ్మెలను ప్రస్తావిస్తూ, అప్పటి పాలనలో కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. దీర్ఘకాల సమ్మె సమయంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుత ప్రభుత్వానికి కార్మికులతో ఎలాంటి విభేదాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. వారిని కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నట్టు చెప్పారు. సమ్మె సమయంలో ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పై కూడా మంత్రి స్పందించారు. శవ రాజకీయాలు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిపారు. సమ్మె సమయంలో కొన్ని పార్టీల వ్యవహారం తగదని సూచించారు.
ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు. బకాయిల చెల్లింపులు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగాల భర్తీ, కారుణ్య నియామకాలు చేపట్టినట్టు చెప్పారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలు వినియోగిస్తున్నారని తెలిపారు. పేదల జీవితాల్లో విద్య, వైద్యం, ఉపాధికి ఆర్టీసీ కీలకంగా ఉందని పేర్కొన్నారు.

