
ఆర్‌టీసీ సత్తాను సర్కార్ తక్కువ అంచనా వేస్తోంది: తలసాని
మహాధర్నలో తలసాని వ్యాఖ్యలు, హామీల అమలు పై ప్రశ్నలు. చర్చలకు వెంటనే పిలవాలని ప్రభుత్వానికి డిమాండ్.
ఆర్టీసీ కార్మికులకు అండగా కేసీఆర్ నిలుస్తారంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాణిగంజ్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేరస్తున్న ధర్నాలో తలసాని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆర్టీసీ కార్మికుల సత్తాను ఈ సర్కార్ తక్కువ అంచనా వేస్తోందని, ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మర్చేయగలరని అన్నారు. గతంలో కేసీఆర్.. సకలన జనులను ఏకం చేయడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని తలసాని గుర్తు చేశారు. ఆ విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, ఆర్టీసీ కార్మికుల కష్టాలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరం అయితే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందని అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలని గతంలో కేసీఆర్ క్యాబినెట్ నిర్ణయించిందని, కానీ ప్రభుత్వం మారడంతో అది వీలు పడలేదని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా పోరాటం చేయాలని, వారికి కేసీఆర్ అండ ఉందని తలసాని అన్నారు. ఆర్టీసీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, దానిని ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు విధులకు వెళ్లకుండా సమ్మె బాట పట్టడం వల్ల ఎందరో ప్రజలు అల్లాడుతున్నారని, దీనికి కారణం ప్రభుత్వం చేతకాని తనమంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. తమ చేతకాని తనానికి ప్రభుత్వం ప్రతిపక్షాలను బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ వెనకుండా ఈ సమ్మె చేయిస్తోందని ఒక మంత్రి అంటున్నారని, అసలు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే సమ్మె చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? అని తలసాని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీపైన కూడా తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమ్మె చేసే కార్మికులను ఆర్టీసీ ఎండీ బెదిరిస్తున్నారని, అసలు ముందు ఆయన ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో ఆయన చూస్కోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తలసాని. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా తలసాని ధీమా వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎలక్ట్రిక్ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను ఉపయోగించడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే ఆర్టీసీ డ్రైవర్లకు ఆ అనుభవం ఉందని తెలిపారు.
అలాగే, అందరూ కలిసి సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లాలని పిలుపునిచ్చారు. హామీలు సాధించే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం కేబినెట్ సమావేశం అనంతరం వెంటనే ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. 29 డిమాండ్లు తీర్చేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఆ డిమాండ్లు ఏంటో స్పష్టంగా ప్రకటించాలని కోరారు. హామీలపై పూర్తి వివరాలు ఇవ్వాలని అన్నారు. జేఏసీ నాయకులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని సూచించారు.

