ఆర్టీసీతో చర్చలు సక్సెస్.. ప్రభుత్వంలో విలీనానికి సర్కార్ ఓకే..
x

ఆర్టీసీతో చర్చలు సక్సెస్.. ప్రభుత్వంలో విలీనానికి సర్కార్ ఓకే..

ఆర్టీసీ చర్చల్లో పురోగతి. విలీనం, PRC, యూనియన్ ఎన్నికలపై సానుకూల స్పందన. సమ్మె విరమణకు అవకాశం.


ఆర్టీసీ జేఏసీ, ఉద్యోగ సంఘాలు, కార్మిక నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అధ్యక్షతన జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి మంత్రులు ఆమోద ముంద్ర వేశారు. డెడ్‌లైన్ పెట్టుకుని మరీ దీనిని పూర్తి చేయడానికి ఓకే చెప్పారు. ముఖ్యంగా మూడు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం అనుకూలంగా స్పందించింది. సమ్మెకు కారణమైన ప్రధాన అంశాలైన ఆర్టీసీ విలీనం, ట్రేడ్ యూనియన్ ఎన్నికలు, పీఆర్‌సీ బకాయిలపై చర్చలు జరిగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి టైమ్ బౌండ్ ప్రక్రియను ప్రారంభించేందుకు మంత్రుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. యూనియన్ ఎన్నికలకు ప్రభుత్వం అభ్యంతరం లేదని, యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అలాగే 2021, 2025 పీఆర్‌సీ ఫిట్‌మెంట్ చెల్లింపులపై కూడా స్పష్టమైన హామీ ఇచ్చింది.

ఉద్యోగ భద్రతకు భరోసా

ప్రైవేట్, అద్దె లేదా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినా ఉద్యోగాలు కోల్పోరని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో కార్మికుల్లో కొంత నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయని జేఏసీ ప్రతినిధులు భావించినట్లు తెలిసింది. ప్రతి నెల జీతాలు సమయానికి వస్తున్నాయని, పెండింగ్ డీఏలు క్లియర్ అయ్యాయని గుర్తుచేశారు. గతంలో తొలగించబడిన ఉద్యోగుల్లో పలువురికి తిరిగి ఉద్యోగాలు కల్పించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు.

కారుణ్య నియామకాలను పర్మినెంట్ విధానంలోకి మార్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో బాధిత కుటుంబాలకు దీర్ఘకాల భద్రత కలిగే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలును ప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తుందని, నగర ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయబోమని కూడా భరోసా ఇచ్చింది. ఈ సందర్భంగా డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి బాధాకరమని పేర్కొంటూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించినట్లు సమాచారం. కార్మిక సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలపై ఇప్పటికే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది. మిగిలిన మూడు కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. యాజమాన్య పరిధిలోని సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని, ప్రభుత్వ పరిధిలో ఉన్నవాటిని ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేసినట్లు తెలిసింది. మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో ఈ చర్చలు కీలకంగా మారాయి. తాజా పరిణామాలు సమ్మె విరమణ దిశగా మార్గం సుగమం చేసే సూచనలు ఇస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆర్టీసీ అందరి సంస్థ: భట్టి

ఆర్టీసీ రాష్ట్రానికి కీలక సంస్థ అని, దాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. గతంలో సంస్థ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. కార్మికుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలనే దృక్పథం ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. సమ్మె కారణంగా ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.

Read More
Next Story