
48 గంటల్లో మోగనున్న తెలంగాణ ఆర్టీసీ సమ్మె సైరన్
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపో, గ్యారేజి, ఆర్టీసి స్థలాలను ఆక్రమిస్తున్న కార్పొరేట్ శక్తులు
సమ్మె సైరన్ మోగటానికి 48 గంటలు మాత్రమే ఉన్నా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సుముఖత చూపుతున్న ఆనవాళ్ళు కనిపించటం లేదు. కార్మిక సంఘాలు మాత్రం ఈ సమ్మె సంస్థ మనుగడ కోసం తలపెట్టామని వెనక్కి తగ్గే ప్రశక్తిలేదని ఘంటా పధంగా చెప్తున్నాయి.
కాగా ఆర్టీసీ లోని వివిధ విభాగాల మద్దతు కూడగట్టి మరో సకల జనుల సమ్మెను తలపించే విధంగా తమ నిరసన తెలపబోతున్నట్టు సంఘాలు పేర్కొంటున్నాయి. 2017 లో 50,000 కార్మికులు 9,500 బస్సులతో 30 లక్షల కిలోమీటర్లు బస్సులను నెలకు తిప్పితే నేడు ఎనిమిది వేల బస్సులు 38,000 కార్మికులతో 36 లక్షల కిలోమీటర్ లు తిరుగుతున్నట్టు కార్మిక సంఘాలు చెప్తున్నాయి. కార్మికులపై పెరిగిన పని భారం గురించి ఇంత కంటే వేరే ప్రమాణం అవసరం లేదని వారు అంటున్నారు.
హైర్ బస్సుల యజమానులు కూడా తమకు మద్దతు ఇస్తున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ జనరల్ సెక్రెటరీ మారంరెడ్డి థామస్ రెడ్డి చెప్పారు. తాము కేవలం కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను మాత్రమే అమలు చేయమని కోరుతున్నామని ఆయన అంటున్నారు.
సమ్మె అనివార్యం:
2025 లోనే జెఎసి ఏర్పడి దశలవారీ ఉద్యమాలు నిర్వహించి మే 7, 2025న సమ్మెకు సిద్ధపడుతున్న సమయంలో మే 6న రవాణా శాఖ మంత్రి ప్రధాన డిమాండ్ల పట్ల సానుకూలత ప్రదర్శించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా సమ్మె చేయకుండా విరమించామని కార్మిక నాయకులు గుర్తు చేశారు.
“అప్పటి నుండి 11 నెలలుగా ఒక్క డిమాండ్ కూడా పరిష్కరించ లేదు. రెండవ సారి జెఎసి ఏర్పడి ప్రభుత్వం మరియు ఆర్టీసి యాజమాన్యానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవటంతో జనవరి 20న పోరాటదినం, ఫిబ్రవరి 24న “ఛలో సెక్రటేరియట్" కార్యక్రమాలను జేఏసి నిర్వహించినప్పటికీ స్పందన రాకపోవడంతో 13 మార్చి, 2026 న సమ్మె నోటీసు ఇచ్చాము,” అని జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
“తమ సమస్యలు డిమాండ్ లను ప్రభుత్వం ముందు పెట్టి చర్చించటానికి ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంఘాలపై ఉక్కుపాదం మోపగా ఆంక్షలు ఎత్తివేసి ఎన్నికలు జరుపుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్తూ ట్రేడ్ యూనియన్లను ఎందుకు పునరుద్ధరించటం లేదు? దీని వలన ఎటువంటి ఆర్థిక భారం పడనప్పటికీ ఇచ్చిన హామీని విస్మరిస్తోంది,” అని ఆయన నిలదీశారు. హై కోర్టు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేస్తూ వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేయటం చట్టవిరుద్ధం అని అన్నారు.
ఎలెక్ట్రిక్ బస్సుల రాక తదుపరి పరిణామాలు:
కాలుష్యం తగ్గిస్తామనే పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలైన జెబిఎం, ఒలెక్ట్రా సంస్థల ద్వారా ఎలెక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పచెబుతున్నారని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హయాత్ నగర్, మియాపూర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిపో గచ్చిబౌలిలలో ఎలెక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. వీటికి అవసరమైన ఛార్జింగ్ పాయింట్ల పై ఖర్చు మొత్తం ఆర్టీసీ భరించింది. ఈ బస్సులను నడిపి, నిర్వహణ చేసేది మొత్తం ప్రైవేట్ సిబ్బంది కావటంతో ఆర్టీసీ కార్మికులకు ఆ డిపోలలో పనిలేకుండా పోతోంది. దీనితో వారిని ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్ పై వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నారు.
“ఎలెక్ట్రిక్ బస్సులకు డిపోలలో కల్పిస్తున్న సౌకర్యాలకు కనీసం రెంట్ ఇతర ఛార్జీలు వసూలు చేయటం లేదు. ఇది ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయటం కాక మరేంటి. గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారమే కేంద్రం నుండి ఎలెక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. బిఆర్ఎస్ విధానాలను వీళ్ళు ఎందుకు అమలు చేస్తున్నారు. కేంద్రం ఎలెక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు రు. 36 లక్షల సబ్సిడీ ఇచ్చి వాటిని ప్రోత్సహిస్తోంది. మొత్తం ఎలెక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నందున సిబ్బందికి పనిలేకుండా పోతోంది. కేవలం రెండు మూడు ఏళ్లు సర్విస్ ఉన్న వాళ్ళను కూడా ఇతర జోన్ లకు బదిలీ చేస్తున్నారు. ఆర్టీసీలో సీనియార్టీ జోన్ల వారీగా అమలవుతుంది,” అని బహుజన కార్మిక యూనియన్ నాయకులు కత్తుల యాదయ్య తెలిపారు.
“రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ఎలెక్ట్రిక్ బస్సుల పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదు. ఈ బస్సులలో హై ఎండ్ వాటికి కిలోమీటర్ కు రాబడి రు. 45 మాత్రమే వస్తున్నా వాటికి ఆర్టీసీ రు. 65 అద్దె చెల్లిస్తోంది. వీటి నిర్వహణకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ క్రింద సిబ్బంది వస్తున్నారు. దీనితో ఆర్టీసీ సిబ్బంది మిగిలిపోవటంతో వారిని వేరే జోన్లకు వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నారు. కాలుష్యం తగ్గించే పేరుతో హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి అన్ని డిపోలలో ప్రైవేట్ సిబ్బంది పరమయితే ఆర్టీసీని డిపోల వారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే పరిస్థితి ఏర్పడుతుంది,” అని జెఎసి వైస్ ఛైర్మన్ మారం రెడ్డి థామస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి ఆర్టీసీ నాలుగు ఏళ్ల క్రితమే తమ డిపోలలోనే డీజిల్ ఇంజిన్ స్థానంలో ఎలెక్ట్రిక్ ఇంజిన్ ను ఏర్పాటు చేసి ఒక బస్సును తిప్పుతోందని (AP11Z 7282) మోసిన్ అనే కార్మికుడు తెలిపారు. ఒక అంచనా ప్రకారం రు. 10,000 కోట్లు ఖర్చు పెడితే అన్ని బస్సులకు ఎలెక్ట్రిక్ ఇంజిన్ అమర్చవచ్చని ఆయన తెలిపారు.
రెండు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న ఆర్టీసీ తానే ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయగలదు.
రిక్రూట్మెంట్:
ఆర్టీసీలో గడిచిన 12 ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేదు. ఇటీవల ఇచ్చిన మూడు వేల ఉద్యోగులు, కార్మికుల కోసం చేపట్టిన ప్రక్రియ నామమాత్రంగా చేపతుడుతునట్టుగా ఉందని కార్మికులు అంటున్నారు. ఒక కొత్త బస్సు వస్తే ఐదుగురికి ఉపాధి లభిస్తుంది అనేది ఆర్టీసీలో కీలకమైన సూత్రం. కానీ డ్రైవరుకే టికెట్ జారీచేసే భాద్యత కట్టబెట్టటంతో కార్మికుల సంఖ్య పెరటం లేదు. డిపోల్లో పనిచేసే ఉద్యోగులు, టెక్నీషియన్స్, శ్రామిక్ ల సంఖ్య కూడా ప్రతి ఏడు రిటైర్మెంట్ వలన తగ్గిపోతోంది. చివరి సరిగా 2009 లో జరిగిన నియామక ప్రక్రియ ద్వారా 2011 లో నియామకాలు చేపట్టారని కార్మికులు గుర్తు చేస్తున్నారు.
అమలుకాని వేతన సవరణలు:
2017 వేతన సవరణ జరిగినా ఆ బకాయిలు నేటివరకూ అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంచలేదు. 2013 వేతన సవరణలో నిర్ణయించిన అలవెన్సులే నేటికీ ఆర్టీసి ఉద్యోగులకు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచి ఆర్టీసి ఉద్యోగులకు కేవలం 21 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. రిటైరైన ఉద్యోగులకు ఫిక్సేషన్లు జరగలేదు, బకాయిలు, సెటిల్మెంట్లు ఇవ్వలేదు. 2017 వేతన సవరణ జరిగిన తరువాత ఆర్టీసి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల కంటే 28 శాతం తక్కువ వేతనాలు పొందుతున్నారు.
ఆర్టీసీలో సిబ్బందికి ప్రతి నాలుగు ఏళ్ళకు కొత్త పీఆర్సీ అమలు చేయాలి. 2021 లోనూ, 2025 లో కొత్త పీఆర్సీ లను అమలు చేయాల్సి ఉంది.
“2017 పీఆర్సీ ని 2025 లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక అమలు చేశారు. దీనితో కార్మికులు అధిక భాగం అప్పులపాలయ్యారు,” అని మోసిన్ అనే కార్మికుడు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా కొత్తగా కండక్టర్, డ్రైవర్, మెకానిక్, గ్రాడ్యుయేట్ సూపర్వైజర్ లను నియమిస్తోంది. రిటైర్ అయిన అధికారులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తూ రెగ్యులర్ నియామకాలను దెబ్బ తీస్తోంది. యాక్ట్ ప్రకారం 8 గంటల డ్యూటీ బదులు 16 గంటలు పని చేయిస్తూన్నారని కార్మికులు తెలిపారు.
గత 12 సంవత్సరాలుగా ఆర్టీసిలో 18 వేల మంది కార్మికులు రిటైర్ అయినా నియామకాలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 3,038 ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రకటిస్తున్నారే తప్ప నేటివరకు నియామకాలు చేయలేదు.
మహాలక్ష్మి పథకం విజయవంతం చేసిన కార్మికులు:
మహాలక్ష్మి పథకం వలన ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వచ్చినా డ్రైవర్, కండక్టర్లపై విపరీతమైన పని వత్తిడి పెరిగి, అధిక రద్దీ వలన అనుకోకుండా జరిగే చిన్న చిన్న తప్పిదాలకు వారిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నారు. అర్హులైన మహిళలకు టికెట్ లెస్ స్మార్ట్ కార్డులను జారీ చేయాలని వారు కోరుతున్నారు.
బస్సులో 200 మంది వరకు ఉంటున్నారని కాబట్టి టికెట్ తీసుకునే భాద్యత ప్రయాణీకుడి పైనే ఉంచాలని కార్మికులు చెప్పారు. ప్రయాణీకుడు నిద్రపోయి లేదా పొరపాటున వేరే స్టేజ్ వరకు ప్రయాణిస్తే కండక్టర్ ను శిక్షిస్తున్నారని, ఒక డ్రైవరు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పథకం వలన అధిక శాతం మహిళలు ఉండి ఆదాయం రావటం లేదని అయినా ఆదాయం తక్కువ ఉందని పెంచాలని ఒత్తిడి చేస్తున్నారని ‘ఫెడరల్’ తో మాట్లాడిన కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసికి ప్రతినెల 382.5 కోట్లు ప్రభుత్వం ఇస్తానని ప్రకటించి, ఇవ్వకుండా ప్రతినెల ఈ సొమ్ము నుండి కోత పెట్టి ఇప్పటివరకు సుమారు 2,500 కోట్లు ఆర్టీసికి ప్రభుత్వం బాకీ ఉందని కార్మిక సంఘాలు లెక్కగట్టాయి. బకాయి వెంటనే చెల్లించటంతో పాటు మహిళా ప్రయాణీకులు రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతున్న కారణంగా ఆర్టీసికి ప్రభుత్వం కొత్త బస్సులు ఇవ్వాలని కార్మిక సంఘాలు తమ డిమాండ్ లలో ఉంచాయి.
2026-27 సంవత్సరానికి బడ్జెట్ లో మహాలక్ష్మి పథకానికి కేవలం రు. 4,305 కోట్లు ప్రొవిజన్ పెట్టడాన్ని ఒక ప్రకటనలో జెఎసి తీవ్రంగా నిరసించింది. సిసిఎస్, పిఎఫ్, ఎస్.ఆర్.బి.ఎస్, ఎస్.బి.టికి చెల్లించాల్సిన 2,100 కోట్ల రూపాయలను ఆయా ట్రస్టులకు చెల్లించాలని అది డిమాండ్ చేసింది.
అలాగే వివిధ వర్గాలకు ఇచ్చే సబ్సిడీలపైనా, పథకాలకు ఆర్టీసీ పెడుతున్న ఖర్చులపైనా ప్రభుత్వం వైట్ పేపర్ ఇవ్వాలని, థామస్ రెడ్డి డిమాండ్ చేశారు.
నాలుగు లెబర్ కోడ్లు:
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను మార్చి నాలుగు కోడ్ లుగా విభజించి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా కార్మిక శ్రమశక్తిని దోపిడీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించి పాత చట్టాలను యధావిధిగా కొనసాగించాలని జెఎసి ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఫిబ్రవరి 12న జరిపిన దేశవ్యాప్త సమ్మెలో సుమారు 40 కోట్ల మంది కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారని అది గుర్తు చేసింది.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో కార్పొరేట్ శక్తులు డిపో, గ్యారేజి, ఆర్టీసి స్థలాలను ఆక్రమిస్తున్నాయని 5 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం ప్రవేశపెడితే కార్మికులతో పాటు అధికారులు మరియు సూపర్వైజర్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని జెఎసి హెచ్చరించింది. ఇప్పటికే ఆర్టీసి స్థలాలు, ఆస్తులను బి.ఓ.టి పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయటం చూస్తూనే ఉన్నాం. ఆర్టీసి సంస్థను ప్రైవేటీకరించటానికి గత ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యమాలు చేస్తూ సంస్థను కాపాడుకున్నాం. ప్రస్తుత తరుణంలో అధికారి, సూపర్వైజర్, కార్మికుడు అనే తేడా లేకుండా సంస్థ సంరక్షణ కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అది గుర్తు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచిన ప్రభుత్వం ఆర్టీసీలోనూ ఆ వయసును 60 కి పెంచింది. “58 తరువాత పని చేసిన రెండు సంవత్సరాలకు పీఎఫ్ తప్ప ఇతర బెనిఫిట్స్ ఇవ్వటం లేదు,” అని మోసిన్ తెలిపారు.
“ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేసి ఆర్టీసీ అప్పు, సంస్థ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం, ఎలెక్ట్రిక్ బస్సుల విధానం తమ చేతిలో లేదని ప్రభుత్వం చెప్తోంది. బిఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ విలీనానికి ఆమోదం తెలిపాక అప్పోయింటెడ్ డేట్ ఇవ్వకుండా ఆలస్యం చేసింది. దీనిపై ఒక కమిటీ వేశామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, జీవో ఎంత అనేది చెప్పాలి. అసలు యూనియన్ లను రద్దు చేసే అధికారం సిఎంకు లేదు. ఆర్టీసీ ఆస్తులను అమ్మే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పార్లమెంటు లో చట్టం చేయాలి. అందుకే దొడ్డిదారిన ఆర్టీసీ ఆస్తులను 99 సంవత్సరాల లీజు పేరుతో ప్రైవేట్ వాళ్ళకు కట్టబెదడుతున్నారు,” అని థామస్ రెడ్డి ఆరోపించారు.
మహా లక్ష్మీ పథకానికి నెలకు రు. 369 కొట్లు ఇస్తామని వాగ్దానం చేశారు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ జీతాలకు రు. 200 కోట్లు సరిపోతుంది. మిగిలిన సొమ్ము సంస్థ మనుగడ కోసం వాడుకోవచ్చు, అని ఆయన వివరించారు. తక్షణం ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరపాలి, అని ఆయన డిమాండ్ చేశారు.

