
ఎన్ని కుట్రలు జరిగినా ధర్మమే గెలిచింది: హరీష్
వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవన్న న్యాయస్థానం.
కాళేశ్వరం కమిషన్ అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలిచిందని అన్నారు. ధర్మానికి పరాజయం లేదన్న అంశాన్ని హైకోర్టు తీర్పు మరోసారి స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు. న్యాయస్థానాల్లో ధర్మమే గెలుస్తుందనడానికి ఈ తీర్పు మరో ఉదాహరణ అని అన్నారు. ఈ మేరకు హరీష్ రావు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అందులో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు. ‘‘ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.
‘‘హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా...ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం..’’ అని పునరుద్ఘాటించారు.
అసలు హైకోర్టు ఏం చెప్పిందంటే..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణలో సహజ న్యాయ సూత్రాలు పాటించలేదని పిటిషనర్లు వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన హైకోర్టు, విచారణ విధానంలో లోపాలు ఉన్నాయని గుర్తించింది. ముఖ్యంగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా, వారి వివరణ తీసుకోకుండా నివేదిక రూపొందించారని కోర్టు అభిప్రాయపడింది.
కమిషన్ చట్టంలోని సెక్షన్ 8బి, 8సి నిబంధనలు పాటించలేదని స్పష్టం చేసింది. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చెల్లవని కోర్టు తెలిపింది. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలనుకున్న తదుపరి చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

