తెలంగాణలో మండుతున్న ఎండలు: 45°C దాటే ఉష్ణోగ్రతలు
x
తెలంగాణలో హీట్ వేవ్ అలెర్ట్ ప్రకటించిన ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న (ఫొటో : ఐఎండీ సౌజన్యంతో)

తెలంగాణలో మండుతున్న ఎండలు: 45°C దాటే ఉష్ణోగ్రతలు

పగలు ఎండల మంట… సాయంత్రం ఉరుములతో జల్లులు


తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల మీదుగా ఏర్పడిన ఉపరితల చక్రవాకం ప్రభావంతో గాలిలో తేమ తగ్గిపోవడంతో పాటు వాయువ్య గాలుల ప్రభావం అధికమై, పలు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎండ తీవ్రత పెరిగింది

గత నాలుగైదు రోజులుగా మరాఠ్వాడ, విదర్భ, కర్ణాటక ప్రాంతాల మీదుగా ఏర్పడిన ఉపరితల చక్రవాకం కారణంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోడి వాతావరణం ఏర్పడిందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు చెప్పారు. గాలిలో తేమ తగ్గడంతో పాటు దిగువ స్థాయిలో వీచే గాలుల ప్రభావంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. నార్త్ వెస్ట్ గాలుల ప్రభావం వల్ల ఎండ తీవ్రత పెరిగిందని చెప్పారు. గాలిలో తేమ తగ్గడం వల్ల వడగాలుల ప్రభావం పెరిగిందని దీంతో తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ తోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయని ధర్మరాజు వివరించారు. ఎల్ నిలో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాల వర్షఫాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త ధర్మరాజు చెప్పారు.

అధిక ఉష్ణోగ్రతలు ఎందుకంటే...

మధ్యప్రదేశ్ నుంచి కొమరిన్ ప్రాంతానికి .9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని, దీని ప్రభావం వల్ల కర్ణాటక, తమిళనాడు వరకు దీని ఆవరణం ఉంటుందని,దీంతోపాటు పశ్చిమ, వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెడ్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.తెలంగణలోని కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు.



నేడు, రేపు తీవ్ర వడగాలులు

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పారు. దక్షిణ తెలంగాణలో ఉరుములు, మెరుపులు అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.తెలంగాణలో సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్ ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ కె నాగరత్న చెప్పారు. రేపు కూడా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్,నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యేఅవకాశాలున్నాయని చెప్పారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. దీంతోపాటు ఉరుముు మెరుపులు కూడా ఉండే అవకాశం ఉందని నాగరత్న చెప్పారు.

తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. ఈ రోజు, రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు,రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతోపాటు గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.



తెలంగాణలో వడగాలుల తీవ్రత

తెలంగాణలో సోమవారం వడగాలుల తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు ఐఎండీ వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45.3డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, పలు జిల్లాల్లో 40డిగ్రీల సెల్సియస్ దాటింది. రాబోయే 48 గంటల్లో పొడి గాలుల వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా గణనీయంగా పెరిగాయి. నిజామాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటాయి.

హైదరాబాద్ నగరవాసులకు హెచ్చరిక

హైదరాబాద్ నగర వాసులకు తీవ్రమైన వడగాలుల (Heatwave) హెచ్చరికను తెలంగాణ వెదర్ మ్యాన్ జారీ చేశారు.వడగాలుల తర్వాత రాబోయే ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.రాబోయే ఒక గంటలో శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, రైదుర్గం, కొండాపూర్, హాఫీజ్‌పేట, తెల్లాపూర్, నానక్‌రామ్‌గూడ సమీప ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. దక్షిణ, తూర్పు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవాారం రాబోయే 2 గంటల్లో సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ వివరించారు.


Read More
Next Story