కమిషనర్ సుమతి స్పెషల్ ఆపరేషన్.. ఆకతాయిల ఆట కట్టు..
x

కమిషనర్ సుమతి స్పెషల్ ఆపరేషన్.. ఆకతాయిల ఆట కట్టు..

మహిళల భద్రతపై ఫిర్యాదుల నేపథ్యంలో అర్ధరాత్రి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు, అనేక అంశాలను వెలికితీశారు.


మల్కాజ్‌గిరి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి 24 గంటలు కూడా గడవకముందే ఐపీఎస్ సుమతి స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మహిళను వేధించే ఆకతాయిల ఆటకట్టించారు. మంగళవారం ఛార్జ్ తీసుకున్న ఆమె.. భాగ్యనగరంలో మహిళల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందుకోసమే అర్థరాత్రి సమయంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ వద్ద నిర్వహించిన ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో 40 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో సుమతి స్వయంగా పాల్గొన్నారు. మంగళవారం అర్ధరాత్రి, ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా ఆమె సాధారణ మహిళలా అక్కడికి వెళ్లి బస్టాండ్ దగ్గర నిలబడ్డారు. బస్సు కోసం వేచి ఉన్నట్టుగా ఉంటూ అక్కడి పరిస్థితులను గమనించారు.

ఆమెను సాధారణ మహిళగా భావించిన కొందరు యువకులు.. ఆమె చుట్టూ చేరి వేధించడం ప్రారంభించారు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసినా యువకులు వెంబడించినట్లు సమాచారం. దాంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు అక్కడే ఉండి మహిళలు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు సుమతి. ఈ సమయంలో సుమారు 40 మంది యువకులు ఇబ్బందులకు గురిచేసినట్లు వెల్లడైంది.

దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుసగా ఫిర్యాదులు రావడంతో, గత మూడు రోజులుగా కమిషనర్ నిఘా పెట్టినట్లు తెలిసింది. అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడం, రాత్రివేళల్లో పరిస్థితులను అంచనా వేయడం ఈ ఆపరేషన్ లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. కొందరు యువకులు మద్యం మత్తులో ఉండగా, మరికొందరు గంజాయి మత్తులో తిరుగుతున్నట్లు గుర్తించారు. రాత్రి సమయంలో మహిళలను వేధించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ ఆపరేషన్ అనంతరం పోలీసులు 40 మంది యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి వయస్సు, భవిష్యత్తు, చట్టపరమైన పరిణామాల గురించి అవగాహన కల్పించినట్లు సమాచారం. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో హాస్టల్స్, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో రాత్రి వేళల్లో యువకుల సంచారం పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. మహిళల భద్రతను మెరుగుపర్చేందుకు పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలు కొనసాగుతాయని అధికారులు సంకేతాలు ఇచ్చారు.

Read More
Next Story