
ఆర్మీ ఆయుధాల కేసును ఛేదించిన పోలీసులు.. మాజీ అధికారే అసలు దొంగ..!
సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. నలుగురిని అరెస్ట్ చేసి ఆయుధాలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. పెన్షన్డ్ అధికారుల్లో ఒకరయిన మల్లేష్ అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అతడిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. అయితే ఈ చోరీ వెనక ఉన్న అసలు కారణం తమకూ ఇంకా తెలియలేదని, దాని కోసం దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఈ చోరీకి.. సంఘ విద్రోహ శక్తులకు ఎటువంటి లింక్ లేదని తమకు తెలిసిందని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. చోరీకి గురైన ఆయుధాలతో పాటు భారీగా బుల్లెట్లు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 31న బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో భారీ చోరీ జరిగింది. ఆర్మీకి చెందిన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్లు కనిపించకుండా పోయాయి. చోరీ విషయం బయటపడిన వెంటనే బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆర్మీ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, మల్కాజ్గిరి పోలీసులు కూడా దర్యాప్తులో భాగమయ్యారు. మొదట బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లోకి ఎవరెవరికి ప్రవేశం ఉందనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు.
ఆయుధాలను నిత్యం ఉపయోగించే 16 మందికి అక్కడికి నేరుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో సెలవుల్లో ఉన్న 54 మందిని, పెన్షన్ తీసుకున్న ఏడుగురిని కూడా విచారించినట్లు తెలిపారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్స్, టెక్నికల్ ఆధారాలను ఉపయోగించి దర్యాప్తు చేపట్టాని పేర్కొన్నారు. ఆయుధాల గది ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, అమ్యునిషన్ సెక్షన్ ఇన్ఛార్జ్ బల్లి మధుతో పాటు పలువురిని ప్రశ్నించామని, వారి సోషల్ మీడియా ఖాతాలు, మెసేజ్‌లు, కాల్ రికార్డులను కూడా పరిశీలించామని తెలిపారు. తొలి దశలో వారి నుంచి అనుమానాస్పద ఆధారాలు లభించలేదని చెప్పారు.
ఆ తర్వాత పెన్షన్ తీసుకున్న ఏడుగురిలో ఇద్దరిపై అనుమానం వచ్చిందని, వారిలో టి.పి.ఎస్. రావుతో పాటు మల్లేష్ అలియాస్ రాజు ఒకరి చెప్పారు. మల్లేష్‌ను జూన్ 30న ఆరోగ్యం, క్రమశిక్షణకు సంబంధించిన కారణాలతో ఆర్మీ నుంచి తొలగించినట్లు అధికారులు తమకు తెలిపారని సీవీ ఆనంద్ చెప్పారు. అతని కదలికలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఏడో తేదీన మల్లేష్‌ను అధికారులు ప్రశ్నించారు. అయితే తన కదలికలకు సంబంధించిన వివరాలను సరిగ్గా చెప్పలేదు. దీంతో అనుమానం మరింత పెరిగింది.
టెక్నికల్ ఆధారాలతో అతని కదలికలను పోలీసులు సరిచూశారు. విచారణకు రావాలని పిలిచినా మల్లేష్ మొదట రాలేదు. ఆ తర్వాత విచారించిన సమయంలో అతడి ప్రవర్తన కూడా పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించింది. మల్లేష్‌పై అనుమానం మరింత బలపడటంతో పోలీసులు అతని భార్యకు కేసు వివరాలు తెలిపారు. ఆమె తన భర్తను ప్రశ్నించడంతో చివరకు ఆయుధాల చోరీకి పాల్పడినట్లు మల్లేష్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లోని స్వగ్రామంలో ఇంటి దగ్గర్లో గుంతతీసి పెట్టినట్లు మల్లేష్ అంగీకరించారు. ఈ మేరకు సెర్చ్ చేసిన పోలీసులు.. చోరీకి గురయిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా తమ దర్యాప్తులో.. మల్లేష్ ముందుగానే చోరీకి ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 28, 29 తేదీల్లో ఆయుధాగారం వద్ద రెక్కీ చేసినట్లు తేలింది. రాత్రివేళ సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను గుర్తించాడు. 30వ తేదీన కార్గిల్ గేట్ నుంచి లోపలికి వెళ్లి పరిస్థితులను గమనించాడు. ఆ తర్వాత 31వ తేదీన ఆయుధాలను చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ చోరీలో ఏడు పిస్తోళ్లు, 13 మ్యాగజైన్లు, నాలుగు ఏకే-203 రైఫిళ్లు, 5.56 ఎంఎం ఆయుధాలు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు, బైనాక్యులర్ వంటి సామగ్రి చోరీకి గురైనట్లు అధికారులు తెలిపారు. చోరీ చేసిన ఆయుధాలను మొదట ఒకచోట పాతిపెట్టిన మల్లేష్.. ఆ తర్వాత మరో ప్రాంతానికి ఎందుకు మార్చాడనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఆయుధాలను దొంగిలించడానికి కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఆర్మీ నుంచి తొలగించారన్న కోపంతోనే ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. చోరీకి గురైన ఆయుధాలు, బుల్లెట్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాల చోరీకి ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు లేదా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగింది. అయితే ఇప్పటివరకు అలాంటి సంబంధాలకు ఆధారాలు లభించలేదని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం మల్లేష్‌ను పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. చోరీ వెనుక ఉన్న పూర్తి కారణం, ఆయుధాలను తరలించిన విధానం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

