సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో ఇన్ని కష్టాలా ?
x
questions in self enumeration

సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో ఇన్ని కష్టాలా ?

ఈ సర్వేలో పాల్గొనేందుకు వెబ్ సైట్లోకి వెళ్ళిన వాళ్ళల్లో చాలామందికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి


ఈమధ్యనే కేంద్రప్రభుత్వం సెల్ఫ్ ఎన్యుమరేషన్ మొదలుపెట్టింది. కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే కాబట్టి యావత్ దేశమంతా మొదలైంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా జనాలు సర్వేలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 26న మొదలైన సర్వే ఈనెల 10వ తేదీతో ముగుస్తుంది. ఈ సర్వేలో పాల్గొనేందుకు వెబ్ సైట్లోకి వెళ్ళిన వాళ్ళల్లో చాలామందికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మామూలుగా సర్వే అంటే ప్రభుత్వం తరపున ఒక బృందం ఇంటికి వచ్చి వివరాలు అడిగి చెప్పినవి రాసుకుని వెళ్ళటమే అందరికీ తెలిసిందే. కానీ ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్లో ఎవరూ మనింటికి రారు. ఎవరికి వాళ్ళు ప్రభుత్వం చెప్పిన https://se.census.gov.in వెబ్ సైట్లోకి ఎంటరవ్వాలి.

ఎంటరవ్వాలంటే ముందు ఇంటి యజమాని పేరు, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అప్పుడు మొబైల్ కు ఒక క్యాప్చా వస్తుంది. దాన్ని నింపిన వెంటనే మరో టేబుల్ ప్రత్యక్షమవుతుంది. అప్పటి నుండే అసలు సమస్య మొదలవుతుంది. ఎలాగంటే మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారో ఆ రాష్ట్రం పేరు సెలక్ట్ చేసుకోమని కనబడుతుంది. తెలంగాణ అని ఎంటర్ చేయగానే ‘ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ ది సెన్సస్ హౌస్’ అని కనబడుతుంది. దానికి ఎదురుగా ఏడు ఆప్షన్లుంటాయి. ఇంటి ఫ్లోర్ ను చెక్కతో చేయించుకున్నారా ? గచ్చు చేయించుకున్నారా ? బండలు పరిచారా ? సిమెంట్ ఫినిషింగా ? టైల్సా ? లేకపోతే గ్రానైటా అనే ఆప్షన్లుంటాయి. ఫ్లోరింగ్ కాబట్టి ప్రతిరోజు నడిచేది, చూసేదే కాబట్టి సమాధానం చెప్పేయచ్చు.

ఇక, రెండో ప్రశ్న ‘ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ వాల్ ఆఫ్ ది సెన్సస్ హౌస్’ అనుంటుంది. దీని ఎదురుగా కూడా ఏడు ఆప్షన్లుంటాయి. అందులో దేనికి టిక్‌పెట్టాలో చాలామందికి తెలిసుండదు. గ్రాస్, బాంబూ, తాచ్డ్, ప్లాస్టిక్/పాలిథిన్, బంకమట్టి, ఇటుక, బండలు, చెక్క, సిమెంట్ లాంటి ఆప్షన్లుంటాయి. ఇక్కడ సందేహం ఏమిటంటే, అసలు ఇంటి గోడలను దేనితో నిర్మిస్తే కేంద్రప్రభుత్వానికి ఎందుకో అర్ధంకాలేదు. దగ్గరుండి ఇంటిని కట్టించుకున్న వాళ్ళయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. అలాకాకుండా కట్టిన ఇంటినో లేకపోతే ఫ్లాట్ నో కొనుగోలు చేసిన వారు ఏమి సమాధానం చెప్పగలరు ?

అలాగే ‘ప్రిడామినెంట్ మెటీరియల్ ఆఫ్ రూఫ్ ఆఫ్ ది సెన్సెస్ హౌస్’ అని మూడో ప్రశ్న కనబడుతుంది. ఇందులో ఇంటి పై కప్పును దేనితో నిర్మించారు అనే ప్రశ్నకు కూడా కొన్ని ఆప్షన్లుంటాయి. ఇలాంటి ప్రశ్నలు మొత్తం 33 ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోయిన సర్వే ముందుకు వెళ్ళదు. సర్వేను పూర్తిచేయాలని అనుకున్న వాళ్ళు కచ్చితంగా తమకు తెలిసినా, తెలియకపోయినా కనబడే ప్రశ్నలకు ఏదో ఒక సమాధానం చెప్పాల్సిందే. మామూలుగా సర్వే అంటే ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు ? పెద్దలు ఎంతమంది ? పిల్లలు ఎంతమంది ? ఎవరేమి చేస్తున్నారు ? ఉద్యోగాలు, వృత్తులు, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళ ఆదాయాలెంత ? వాహనాలు, ఇంట్లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపైన ప్రశ్నలుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఇంటి గచ్చు, గోడలు, పై కప్పు దేనితో చేశారు లాంటి ప్రశ్నలను చూడటం ఇదే మొదటిసారి. అసలు ఇలాంటి ప్రశ్నలను ఎందుకు అడిగారో కూడా తెలీదు. మూడు ప్రశ్నలకే చాలామంది సమాధానాలు చెప్పలేకపోతే ఇక మిగిలిన 30 ప్రశ్నల సంగతి చెప్పనే అక్కర్లేదు. కేంద్రప్రభుత్వమేమో అందరూ సర్వేలో పాల్గొనండి, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని పదేపదే ప్రకటనలు జారీచేస్తోంది. జనాలకు స్పూర్తిగా ఉంటుందని గవర్నర్ శివప్రతాప్ శుక్ల, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సర్వేలో పాల్గొన్న ఫొటోలను వార్తల్లోను, ప్రకటనల్లోను చూపిస్తోంది. ప్రశ్నలను ఇంత సంక్లిష్టంగా పెట్టి సమాధానాలు చెప్పండి, సర్వేల్లో పాల్గొనండి అని అంటే ఎంతమంది సమాధానాలు చెప్పగలరు ?

పైగా ఒకసారి సర్వేలోని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత మళ్ళీ మార్పులు చేసేందుకు లేదు. తెలీకుండా సమాధానాలు చెప్పటం ఎందుకులెమ్మని చాలామంది కొన్ని ప్రశ్నలను దాటేస్తున్నారు. అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే సర్వేలోని తదుపరి ప్రశ్నలతో ముందుకెళ్ళేందుకు లేదు. అందుకనే మనకెందుకొచ్చిన గొడవ అనుకుని సర్వేను అర్ధాంతరంగానే ముగించేస్తున్నారు. మరీ విషయాలు ప్రభుత్వంలోని ముఖ్యుల దృష్టికి వెళ్ళిందో లేదో తెలీదు.

Read More
Next Story