భారత్ లో రాజకీయ దుమారం రేపిన సెర్గియో గోర్ వ్యాఖ్యలు
x

భారత్ లో రాజకీయ దుమారం రేపిన సెర్గియో గోర్ వ్యాఖ్యలు

రూబియోను, జైశంకర్ కలుస్తారనే ప్రకటనపై కాంగ్రెస్ ఆగ్రహం


Click the Play button to hear this message in audio format

అమెరికా రాయబారీ సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత్ లో రాజకీయ దుమారం రేపింది. ఈ నెలలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత ఆర్థిక రాజధాని ముంబై పర్యటనకు రాబోతున్నారు.

ఈ పర్యటనలో భాగంగా జామ్ నగర్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన అయిల్ రిఫైనరీని సందర్శిస్తారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మార్కో రూబియో కలుస్తారని గోర్ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

జైశంకర్ ముంబైకి రావాలని అమెరికా కోరిందని, అందుకే ఆయన ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్నారని, వాషింగ్టన్ ముందు లొంగిపోయారని విమర్శలు గుప్పించింది. అక్టోబర్ 20న ముంబైలో రూబియోతో జైశంకర్ సమావేశమవుతారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

అక్టోబర్ 15న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో గోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. జైశంకర్ తమతో సమావేశమవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ‘ఎక్స్‌పెక్ట్’ అనే పదప్రయోగం వల్ల భారత విదేశాంగ మంత్రిని అమెరికా పిలిపిస్తున్నట్లుగా భావించే పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా విదేశీ ప్రముఖులకు ఢిల్లీలో ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయం ఉన్నప్పటికీ, రూబియో ముంబైకి రావడం కూడా చర్చకు దారితీసింది.

మోదీ ప్రభుత్వానికి ఇబ్బంది...

అమెరికా ఒత్తిడికి న్యూఢిల్లీ తలొగ్గుతుందని, వాషింగ్టన్ ను ఎదుర్కోవడానికి వెనకాడుతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఒక ఉద్యోగిని పిలిపించుకున్నట్లు జైశంకర్ ను రప్పించుకుంటున్నారని ఆరోపించారు.‘‘మిస్టర్ రూబియో తన ఉద్యోగిని ముంబైకి పిలిపించారు. మోదీ జీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని మీ అధికారులు ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో ఉన్నారు’’ అని రాహుల్ గాంధీ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
మరోవైపు, భారత విదేశాంగ శాఖ ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. విదేశాంగ మంత్రి జైశంకర్ అక్టోబర్ 20న ముంబైలో రూబియోతో సమావేశమవుతారని అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. విదేశీ ప్రముఖులతో ఢిల్లీ వెలుపల సమావేశాలు నిర్వహించడం కొత్తేమీ కాదని వివరించారు.
గతంలో అహ్మదాబాద్‌లో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో, వారణాసిలో మారిషస్ ప్రధానితో, వడోదరలో స్పెయిన్ ప్రధానితో ప్రధాని మోదీ సమావేశమైన విషయాలను గుర్తుచేశారు. గోవాలో షాంఘై సహకార సంస్థ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
రూబియోతో జరిగే చర్చల్లో ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, కీలక ఖనిజాలు సహా ద్వైపాక్షిక అంశాలపై సమీక్ష జరగనుంది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపైనా ఇరువురు చర్చించనున్నారు. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లకు సంబంధించిన అంశంపై అమెరికా వైఖరి నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం అమెరికా ఆంక్షల్లో ఉండటంతో ఇంధన సంబంధాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌–అమెరికా సంబంధాల్లో వాణిజ్య సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్లు వంటి అంశాలపై విభేదాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో, ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రూబియో పర్యటన, జైశంకర్‌తో సమావేశం ద్వైపాక్షిక సంబంధాల తదుపరి దిశను అంచనా వేయడానికి కీలకంగా మారాయి.
సెర్గియో గోర్ కు ముక్కుసూటీగా వ్యవహరిస్తారనే పేరుంది. ట్రంప్ లాగే దౌత్య నియమాలు పాటించే అధికారం ఆయనకు లేదు. ట్రంప్ కు అత్యంత సన్నిహితుడని, రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సేత్, మిగతా మంత్రుల వలే ఆయనకు కూడా అసహనం ఎక్కువని పేరుంది. ప్రస్తుతం భారత్ - అమెరికా మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలను ప్రొత్సహించడానికి ఆయన ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో ట్రంప్ ఇలాగే దుడుకుగా వ్యవహరించారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ కాల్పుల విరమణ ప్రకటించకముందే డొనాల్డ్ ముందుగానే ట్వీట్లు చేసి నిర్ణయాన్ని ప్రకటించారు. శాంతి ఒప్పందం ఘనత తనకు మాత్రమే దక్కాలని ఆరాటపడ్డారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఆగ్రహించి, ట్రంప్ లేదా అమెరికా పేరును ప్రస్తావించకుండా ఆ వాదనను తిరస్కరించింది.
చాలాకాలంగా ట్రంప్ చేస్తున్న వాదనలు, విమర్శల పట్ల భారత్ మౌనంగానే ఉంటోంది. ఎందుకంటే ఎఫ్‌డీఐలు, సాంకేతికత బదిలీ, భారత ఎగుమతులకు అమెరికా మంచి మార్కెట్.
Read More
Next Story