
షాబాద్ హత్యల కేసులో ఊహించని పరిణామం(వీడియో)
సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో కొత్తూరు గ్రామంలోని ఒక రియల్‌ఎస్టేట్ వెంచర్ దగ్గర ఒకవ్యక్తి చనిపోయి పడున్నాడనే సమాచారం పోలీసులకు అందింది
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్యల నిందితుడు రాజకుమార్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడలో ఈనెల 11వ తేదీన ఒక ఇంటిలోని మైనర్ బాలికతో పాటు బాలిక తల్లి, నానమ్మను రాజకుమార్ హత్యచేసిన విషయం తెలిసిందే. తర్వాత కొద్దిసేపటికి తన ఇంటికి వెళ్ళిన నిందితుడు తన బార్యతో పాటు చిన్న పిల్లలు ఇద్దరినీ కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత తన తల్లి, దండ్రులకు ఫోన్‌చేసి ఆరుగురిని హత్యచేసినట్లు చెప్పి కాసేపటిలో తానుకూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ ను స్విచ్చాఫ్ చేసేశాడు.
కొడుకు చెప్పిన విషయాన్ని రాజ్ కుమార్ తండ్రి వెంటనే షాబాద్ పోలీసులకు చెప్పటంతో ఆరుగురి హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. రెండుకుటుంబాల్లోని ఆరుగురి హత్య విషయం వెలుగుచూడగానే ఘటన తెలంగాణలో సంచలనమైంది. అప్పటినుండి పోలీసులు రాజకుమార్ కోసం రాష్ట్రమంతా జల్లెడపట్టారు. కృష్ణాజిల్లాలోని నందిగామలో కనిపించాడని ఒకసారి లేదు లేదు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో చూశామని మరోసారి ఇలాంటి ప్రచారం అవుతోంది. ఈ నేపధ్యంలోనే సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో కొత్తూరు గ్రామంలోని ఒక రియల్‌ఎస్టేట్ వెంచర్ దగ్గర ఒకవ్యక్తి చనిపోయి పడున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. దాంతో వెంటనే పోలీసులు మృతదేహాన్ని గమనించి రాజకుమార్ అని గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగులమందు డబ్బా కూడా కనిపించింది. దాంతో ఆరుగురిని హత్యచేసిన రాజకుమార్ జీవితం చివరకు ఆత్మహత్యతో ముగిసింది.
రాజకుమార్ నేపధ్యం మొదటినుండి కూడా అస్తవ్యస్ధంగానే ఉందని సమాచారం. ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ట్యూషన్ కు వెళ్ళేవాడు. ట్యూషన్ టీచర్ సరితను ప్రేమిస్తున్నానని చెప్పి వేధించేవాడని తెలిసింది. విషయం తెలిసి టీచర్ తల్లి, దండ్రులు పెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే వచ్చిన సంబంధాలను చెడగొట్టిన రాజకుమార్ చివరకు ఒత్తిడిచేసి తనకన్నా 6 సంవత్సరాలు పెద్దదయిన సరితను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నాడు కాని వైవాహిక జీవితం అంతా గందరగోళంగానే ఉండేది. అందుకనే రాజకుమార్ తో తెగతెంపులు చేసుకున్న సరిత విడాకులు తీసుకోవాలని డిసైడ్ చేసుకున్నది.
ఇంట్లో నిత్యం గొడవలు అవుతుండటంతో రాజకుమార్ కన్ను పక్క ఇంట్లోనే ఉండే మైనర్ బాలిక మీద పడింది. వెంటనే బాలికను వేధించటం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేక బాలిక తల్లి రాజకుమార్ మీద పోలీసులకు ఫిర్యాదుచేసింది. మైనర్ బాలిక మీద వేధింపులు ఫిర్యాదు కావటంతో పోలీసులు రాజకుమార్ మీద పోక్సో కేసు నమోదుచేశారు. పోలీసుల కౌన్సిలింగ్ జరిగింది. కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. పోక్సో కేసు నమోదవ్వటంతో తనకు అవమానం జరిగిందనే కోపంతో ఈనెల 11వ తేదీన రాత్రి కత్తి తీసుకుని బాలిక ఇంట్లోకి వెళ్ళాడు. అడ్డొచ్చిన బాలికను కొట్టి అమ్మాయి తల్లితో పాటు నానమ్మను కత్తితో పొడిచేశాడు. తర్వాత అమ్మాయిని గ్రామం బయటకు కారులో తీసుకెళ్ళి అక్కడ పొడిచి చంపేశాడు.
ఆ తర్వాత తన ఇంటికి చేరుకుని నిద్రపోతున్న భార్యను లేపి వెంటనే కత్తితో పొడిచి చంపేశాడు. అలాగే నిద్రలో ఉన్న ఇద్దరు కొడుకులను కూడా చంపేసి పరారయ్యాడు. రెండురోజుల పాటు పోలీసులు రాష్ట్రమంతా ఉరుకులు పరుగులు పెట్టించిన రాజకుమార్ చివరకు కొత్తూరు గ్రామంలోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించుకున్నాడు.

