ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
x

ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొనడంతో ఘోర ప్రమాదం. ఇద్దరు చిన్నారులు మృతి. ఒకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం నాడు ఎగ్జిట్-16 సమీపంలో రోడ్డు పక్కన నిలిచిన లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం తీవ్రంగా ఉండడంతో కారు లారీ వెనుక భాగంలో సగం వరకు దూసుకుపోయింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే శంషాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడానికి గ్యాస్ కట్టర్ల సహాయం తీసుకున్నారు. కారు నెంబర్ TS 23 F 2298గా గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో కారు అధిక వేగంతో ఉండటం లేదా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. యాదగిరిగుట్ట నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. అధికారులు ఘటనపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం విని తాను ఎంతో కలత చెందానని చెప్పారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

Read More
Next Story