
అమ్రాబాద్ అడవుల్లో నివాసముంటున్న చెంచు గిరిజనులు( ఫైల్ ఫొటొ)
‘టైగర్ రిజర్వ్’ కాదు ‘చెంచు రిజర్వ్’గా ప్రకటించాలి : ఈఎఎస్ శర్మ
అడవే చెంచుల జీవనం.. తరలింపు అమానుషం
నల్లమల అడవుల్లో తరతరాలుగా నివసిస్తున్న చెంచు గిరిజనులను టైగర్ పరిరక్షణ పేరుతో తరలించడం రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధమని మాజీ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి ఏపీ గిరిజన శాఖ మాజీ కమిషనర్ డాక్టర్ ఈఎఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతాన్ని ‘టైగర్ రిజర్వ్’గా కాకుండా ‘చెంచు రిజర్వ్’గా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, సీఎం ఎ రేవంత్ రెడ్డి తదితరులకు ఆయన లేఖలు రాశారు. పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామసభల సమ్మతి లేకుండా చెంచులను తరలించడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
నల్లమల అడవుల్లో చెంచు గ్రామాలున్నందున ఈ ప్రాంతాన్ని చెంచు రిజర్వుగా నోటిఫై చేసి గిరిజనుల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని మాజీ ఐఎఎస్ అధికారి, ఉమ్మడి ఏపీ గిరిజన శాఖ కమిషనర్ డాక్టర్ ఈఎఎస్ శర్మ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు హేమంత కేశవ్ పాటిల్ కు ఆయన లేఖలు రాశారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ అని అనడం బదులు, ఆ ప్రాంతాన్ని చెంచు రిజర్వ్ పేర్కొనాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో గత తరతరాలుగా నివసిస్తున్న వందలాది మంది చెంచు కుటుంబాలను టైగర్ పరిరక్షణ పేరులో తరలించడం పీసా చట్టానికి, అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకం అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునః పరిశీలించాలని డాక్టర్ ఈఎఎస్ శర్మ కోరారు.
అడవిలో చెంచుల నివాసాలు
పీసా చట్టాన్ని ఉల్లంఘించొద్దు
అమ్రాబాద్ అటవీ ప్రాంతం రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ కింద నోటిఫై చేసిన ప్రాంతం అని, ఆ షెడ్యూల్ లో 5వ పారా కింద చెంచు గిరిజనులకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయని మాజీ ఐఎఎస్ అధికారి శర్మ పేర్కొన్నారు.వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వంటి చట్టాలను ప్రభుత్వం, ఆదివాసీలకు అనుగుణంగా సవరించి అమలు చేయాలని ఆయన కోరారు. కాని రాజకీయ పార్టీలకు, ఆదివాసీలపట్ల ఉన్న ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ఆ చట్టాలను ఈ రోజువరకు ప్రభుత్వాలు సవరించలేదన్నారు. అమ్రాబాద్ ప్రాంతానికి పీసా చట్టం వర్తిస్తుందని, ఈ చట్టం కింద, స్థానిక ఆదివాసీ గ్రామసభల ముందస్తు సమ్మతి లేకుండా ప్రభుత్వం చెంచుల జీవితాల మీద ప్రభావం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం నిషేధించారని ఆయన గుర్తు చేశారు. ఒడిశాలో వేదాంత మైనింగ్ కేసులో సుప్రీమ్ కోర్టు ఈ విషయాన్ని 2013, ఏప్రిల్ 18న ఇచ్చిన తీర్పులో ధ్రువపర్చారని శర్మ తెలిపారు. పీసా చట్టం కింద షెడ్యూల్డ్ గ్రామాల పంచాయతీలలో కనీసం 50శాతం సీట్లు ఆదివాసీలకు రిజర్వ్ చేశారని చెప్పారు.
చెంచుల పునరావాస కార్యక్రమం జరుగుతున్న గ్రామాల్లో ప్రభుత్వం,అధికారులు, పంచాయతీ సర్పంచుల సంతకాలు తీసుకుని, పునరావాసానికి పంచాయతీ సమ్మతి ఉందనడం చట్టబద్ధం కాదని మాజీ ఐఎఎస్ అధికారి శర్మ పేర్కొన్నారు.
చెంచులకు అడవిపై హక్కులున్నాయి...
పీసా చట్టం వర్తించే అటువంటి చెంచు గ్రామాల్లో, చెంచుల పునరావాసం విషయంలో, జిల్లా రెవిన్యూ అధికారులు, చెంచు కుటుంబాలతో పారదర్శకంగా సంప్రదింపులు చేపట్టకుండా, ఇతర వ్యక్తులను, ఇతర శాఖలను సంప్రదించడంలో అర్థం లేదని మాజీ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2006 లో కేంద్రం ప్రవేశపెట్టిన అటవీహక్కుల చట్టం (FRA) ప్రకారం అటవీ ప్రాంతాల్లో అడవుల మీద ఆధారపడి ఉన్న ఆదివాసీలకు, ఇతర అటవీప్రాంత వాసులకు వ్యక్తిగతంగా అనుభవించే హక్కు, అటవీ సంపదమీద స్థానిక ఆదివాసీగ్రామ ప్రజలకు, ఉమ్మడి గా అనుభవించే హక్కు కూడా లభించాయని ఆయన గుర్తు చేశారు.
మాజీ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ
గ్రామాలను తరలించొద్దు
అడవుల్లోని షెడ్యూల్డ్ గ్రామాలైన సార్లపల్లి, కుడిచింతల బైలు, తాటిగుండల పెంట, కొల్లంపెంట గ్రామాలలో 417 కుటుంబాలను తరలించే ప్రక్రియ మొదలు అయిందని, రెండో విడతలో షెడ్యూల్డ్ గ్రామమైన వట్ వర్లపల్లి గ్రామం నుంచి కూడా చెంచులను తరలించే ప్రయత్నం జరుగుతుందని మాజీ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ పేర్కొన్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో భూములను అనుభవించే అర్హత గిరిజనులకు ఉందన్నారు.ఈ విషయాన్ని స్థానిక రెవిన్యూ అధికారులు పూర్తిగా పరిశీలించలేదన్నారు. ఎల్టీఆర్ చట్టం కింద అర్హత లేనివారిని తరలించడం విషయంలో, వారికి నష్టపరిహారం ప్రభుత్వం ఏవిధంగా ఇవ్వగలదని ఆయన ప్రశ్నించారు.
చెంచుల హక్కులకు నష్టం కలిగించొద్దు
పునరావాస కార్యక్రమం కింద నిర్వాసితులైన చెంచు కుటుంబాలను ప్రభుత్వం 100 కిలోమీటర్ల దూరంలో షెడ్యూల్డ్ ప్రాంతం బయట ఉన్న బాచారం గ్రామానికి తరలిస్తుందని శర్మ చెప్పారు. పునరావాస ప్రక్రియ కారణంగా రాజ్యాంగం 5వ షెడ్యూల్ ద్వారా లభించిన హక్కులను, చెంచులు నష్టపోతారని ఆయన పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం వారికి ఎంత నష్టపరిహారం ఇచ్చినా, వారికి షెడ్యూల్డ్ ప్రాంతం లో లభించే హక్కులు తిరిగి రావని ఆయన స్పష్టం చేశారు.అమ్రాబాద్ చెంచుల పునరావాస ప్రక్రియ విషయంలో, ప్రభుత్వం చట్టపరమైన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించకుండా, టైగర్ రిజర్వ్ ను అమలుచేసే ఒత్తిడికి లొంగి, చెంచుల హక్కులకు నష్టం కలిగిస్తున్నదని శర్మ ఆరోపించారు.
అడవి నుంచి తరలింపు అమానుషం
1949 లో చెంచులకు రాజ్యాంగ పరమైన అదనపు హక్కులు లభించాయని, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 లో ప్రవేశపెట్టడం జరిగిందని మాజీ ఐఎఎస్ అధికారి శర్మ చెప్పారు. శ్రీశైలం-నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ 1978 లో నోటిఫై చేశారని ఆయన గుర్తు చేశారు. తదుపరి నోటిఫై చేయబడిన టైగర్ రిజర్వ్ కారణంగా, చెంచులకు దశాబ్దాల ముందు నుంచీ ఉన్న హక్కులను భంగపరచడం, వారు తరతరాలుగా నివసిస్తున్న ప్రాంతం నుంచి, వారు తరతరాలుగా అనుభవిస్తున్న అటవీ సంపద నుంచి తరలించడం అమానుషమని శర్మ ఆరోపించారు.
రాజ్యాంగంలోని 21 వ ఆర్టికల్ కింద చెంచు గిరిజనులకు ఉన్న "జీవించే హక్కు" కు నష్టం కలిగించడం అవుతుందని శర్మ వివరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం అమ్రాబాద్ చెంచుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, స్థానికంగా ఏ విధంగా వారి కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే విషయం మీద వారిని సంప్రదించి ముందుకు పోవాలని మాజీ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ విజ్ఞప్తి చేశారు.
Next Story

