బొగ్గు కొరతకు చెక్..నైనీ గని నుంచి ఎస్‌టీపీపీకి తొలి బొగ్గు రైలు..
x

బొగ్గు కొరతకు చెక్..నైనీ గని నుంచి ఎస్‌టీపీపీకి తొలి బొగ్గు రైలు..


ర‌చ్చ‌ - రాజ‌కీయం @ 5 పి.ఎం.

1) బొగ్గు కొరతకు చెక్..నైనీ గని నుంచి ఎస్‌టీపీపీకి తొలి బొగ్గు రైలు..
2) ఓటర్ల జాబితాలో భారీ గందరగోళం!హైదరాబాద్‌లో 10 లక్షల ఓటర్లు ఏమయ్యారు?
3) 'Y' ఆకారంలో మెగా ఫ్లైఓవర్!నాంపల్లి-లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు చెక్!

1) బొగ్గు కొరతకు చెక్..నైనీ గని నుంచి ఎస్‌టీపీపీకి తొలి బొగ్గు రైలు..
తెలంగాణలో విద్యుత్ రంగానికి కీలక మైలురాయిగా నిలిచే పరిణామం చోటుచేసుకుంది. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలిసారిగా బొగ్గుతో నిండిన రైలు మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (STPP)కు చేరుకుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ, ఇది సింగరేణి చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశ విద్యుత్ అవసరాలకు సింగరేణి బొగ్గు ఎంతో కీలకమని, భవిష్యత్తులో మరిన్ని కోల్ బ్లాకుల కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పారు.
గురువారం ఉదయం 59 రైల్వే వ్యాగన్లలో సుమారు 4,000 టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గు నైనీ గని నుంచి జైపూర్‌లోని ఎస్‌టీపీపీకి చేరుకుంది. బొగ్గు రైలు చేరుకోగానే సింగరేణి అధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.ఈ బొగ్గు సరఫరాతో థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు ఎదురవుతున్న ఇంధన కొరత కొంత వరకు తీరనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రత్యేకత ఏమిటంటే... 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా తెలంగాణ వెలుపల ఉన్న సొంత కోల్ బ్లాక్ నుంచి బొగ్గును తవ్వి, అదే సంస్థ నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రానికి రవాణా చేయడం ఇదే మొదటిసారి.ఈ పరిణామం సింగరేణి విస్తరణలోనే కాకుండా, తెలంగాణ విద్యుత్ భద్రతను మరింత బలోపేతం చేసే అడుగుగా అధికారులు అభివర్ణిస్తున్నారు.
నైనీ గని చేరికతో సింగరేణి చేతికి మరో బంగారు గని దొరికినట్లే. 35 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు, ఏడాదికి కోటి టన్నుల ఉత్పత్తి సామర్థ్యం, 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి రాష్ట్రం వెలుపల విస్తరణ... ఇవన్నీ సింగరేణి భవిష్యత్తును మరింత బలోపేతం చేయనున్నాయి.

2) ఓటర్ల జాబితాలో భారీ గందరగోళం!హైదరాబాద్‌లో 10 లక్షల ఓటర్లు ఏమయ్యారు?
హైదరాబాద్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో ముందుకెళ్తుండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇదే సమయంలో ఎస్‌.ఐ.ఆర్‌. ప్రక్రియలో హైదరాబాద్‌లో భారీగా ఓటర్ల పేర్లు తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ ఓట్ల కోత ఎవరికి నష్టం చేస్తుంది? ఏ పార్టీ రాజకీయ సమీకరణాలను మార్చబోతోంది? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
హైదరాబాద్ జిల్లాలో నమోదైన మొత్తం 47,36,669 మంది ఓటర్లలో 9,95,315 మంది ఆచూకీ తెలియకుండా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 21 శాతం మంది ప్రస్తుతం కనిపించడం లేదు.
ఈ జాబితాలో మరణించిన వారు కొందరు ఉన్నప్పటికీ, మిగతా వారి వివరాలు అధికారులకు అందుబాటులో లేవు. వారు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉండొచ్చని, లేదా వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి మళ్లీ వెళ్లిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వీరిని "ఆచూకీ తెలియని ఓటర్లు" జాబితాలో చేర్చారు.
నియోజకవర్గాల వారీగా చూస్తే జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 88,933 మంది ఓటర్లు కనిపించకపోగా, అంబర్‌పేటలో అత్యల్పంగా 38,208 మంది ఉన్నారు.డిజిటలైజేషన్ నెమ్మదిగా...ఎన్నికల అధికారులు ఇంటింటికీ వెళ్లి, రాజకీయ పార్టీల సహకారం కోరుతూ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఇప్పటి వరకు 27,26,655 మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. ఇది మొత్తం ఓటర్లలో 57.56 శాతం మాత్రమే. ఇక 4,91,236 మంది (10.37 శాతం) ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేశారు. ఈ నెల 10వ తేదీ వరకు ఫారాల సమర్పణకు గడువు ఉండటంతో ఈ గణాంకాల్లో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మార్పులుఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రాజకీయ నాయకుల ఇళ్లు, మతపరమైన ప్రదేశాలు వంటి సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండకూడదని నిర్ణయించారు. దీంతో హైదరాబాద్ జిల్లాలో 94 భవనాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
39 పోలింగ్ కేంద్రాల పేర్లలో మార్పులు71 పోలింగ్ కేంద్రాల విలీనం లేదా రద్దుఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 4 కొత్త పోలింగ్ కేంద్రాలు.ఈ మార్పులతో ప్రస్తుతం ఉన్న 4,062 పోలింగ్ కేంద్రాలు 3,995కు తగ్గనున్నాయి.
ఇది ఎన్నికల జాబితా సవరణలో అత్యంత కీలక పరిణామంగా మారింది. దాదాపు 10 లక్షల మంది ఓటర్ల ఆచూకీ ఇప్పుడు అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. "తెలంగాణలో 56 లక్షల ఓటర్లపై డిలీషన్ కత్తి వేలాడుతోంది. మృతులు, వలసలు, డూప్లికేట్ నమోదులు, ఆచూకీ లేని ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది."

3) 'Y' ఆకారంలో మెగా ఫ్లైఓవర్!నాంపల్లి-లక్డీకాపూల్ ట్రాఫిక్‌కు చెక్!
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లి-లక్డీకాపూల్ కారిడార్‌లో 'వై' ఆకారంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత ఫ్లైఓవర్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సమీపం నుంచి ప్రారంభమై, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ వెనుక భాగం మీదుగా రైల్వే ట్రాక్ వెంట లక్డీకాపూల్ వరకు నిర్మించనున్నారు.
ఈ ఫ్లైఓవర్ మొత్తం 1.45 కిలోమీటర్ల పొడవుతో, మూడు లేన్ల వన్‌వే మార్గంగా రూపొందనుంది. లక్డీకాపూల్ వద్దకు చేరుకున్న తర్వాత ఇది రెండు దిశలుగా విడిపోయి 'వై' ఆకారాన్ని సంతరించుకుంటుంది.ఒక శాఖ దాదాపు 400 మీటర్ల పొడవుతో మాసబ్‌ట్యాంక్ వైపు ఉన్న ఫ్లైఓవర్‌కు అనుసంధానం కానుండగా, మరో శాఖ సుమారు 530 మీటర్ల మేర ఖైరతాబాద్ వైపు కలుస్తుంది. ఈ రెండు శాఖలు రెండేసి లేన్లతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు.
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్ జంక్షన్లలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగర కోర్ ఏరియాలో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాహనాల రద్దీ కూడా నియంత్రణలోకి వచ్చే అవకాశముంది.ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌లోని కీలక ట్రాఫిక్ కారిడార్‌కు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Read More
Next Story