
సర్ టార్గెట్ ఎవరో చెప్పిన రామచంద్రరావు
నకిలీ, డూప్లికేట్, మరణించిన ఓటర్ల గుర్తింపే లక్ష్యమని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబోరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేశారు.
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) షురూ అయింది. అసలు ఈ సర్ టార్గెట్ ఏ ఓటర్లు అన్న అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు క్లారిటీ ఇచ్చారు. సర్ ప్రక్రియ ఏ ఒక్క ఓటరు కార్డ్‌ను తొలగించదని, కేవలం ఫేక్, డూప్లికేట్ ఐడీలనే తొలగిస్తుందని చెప్పారు. అయితే ఈ SIR ప్రక్రియపై పలు పార్టీల నేతలు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు సైతం ఎస్‌ఐఆర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పార్టీ కార్యకర్తలు దగ్గరుండి ప్రతి ఓటరు గుర్తింపును రక్షించాలని అన్నారు. ఈ క్రమంలోనే రామచంద్రరావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కాగా ఎస్‌ఐఆర్ అనేది బీజేపీ తీసుకొచ్చిన ప్రోగ్రాం కాదని, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయమని ఆయన వివరించారు. రంగారెడ్డి పట్టన జిల్లాకు సంబంధించి నాగోల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీజేపీ సమావేశం నిర్వహించింది. ఇందులో కార్యకర్తలను ఉద్దేశించి రామచంద్రరావు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం తర్వాత ఇలాంటి సవరణలు ఇప్పటికే 11 సార్లు జరిగాయని, చివరిసారి 2002లో నిర్వహించారని చెప్పారు.
ముస్లింల ఓట్లు తొలగిస్తారంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏ వర్గానికి చెందిన నిజమైన ఓటు కూడా తొలగించబోరని, కేవలం నకిలీ, డూప్లికేట్, మరణించిన ఓటర్లతో పాటు అక్రమ రోహింగ్యాల పేర్లను మాత్రమే తొలగిస్తారని పేర్కొన్నారు. ప్రజల మద్దతు తగ్గుతున్న విషయాన్ని కాంగ్రెస్ అంగీకరించలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని రామచందర్ రావు విమర్శించారు.
కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఓటర్ల తొలగింపులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయన్న ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ఓటు హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు. విదేశీయులు, రోహింగ్యాలు, అక్రమంగా దేశంలోకి వచ్చిన బంగ్లాదేశీయుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకూడదని అన్నారు. నకిలీ ఓట్లను గుర్తించి తొలగించడం అవసరమని తెలిపారు. ఈ ప్రక్రియలో బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా బీఎల్‌ఏ-2 ప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బూత్ స్థాయిలో పని చేస్తూ అవసరమైన పత్రాల విషయంలో ఓటర్లకు సహాయం చేయాలని సూచించారు. అలాగే డూప్లికేట్, మరణించిన ఓటర్ల వివరాలను గుర్తించాలని కోరారు. ఎస్‌ఐఆర్ తర్వాత సిద్ధమయ్యే నవీకరించిన ఓటర్ల జాబితా ఆధారంగానే భవిష్యత్ ఎన్నికలు జరుగుతాయని రామచందర్ రావు తెలిపారు. ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలని కార్యకర్తలకు సూచించారు. ఓటర్ల జాబితాను శుద్ధి చేయడం ఎన్నికల కమిషన్ లక్ష్యమని, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడుతూ నకిలీ పేర్లను తొలగించేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

