
‘సర్’ చట్టబద్దం, రాజ్యాంగ బద్దమే: సుప్రీంకోర్టు
స్టే ఇవ్వడానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చట్టబద్దంగా చెల్లుబాటు అవుతుందని, రాజ్యాంగబద్దంగా ముందుకు తీసుకెళ్తుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల కోసం అవసరమని పేర్కొంది.
లైవ్ లా నివేదించిన ప్రకారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్చా బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 కింద రూపొందించిన చట్టాల ప్రకారం ఎన్నికల సంఘానికి ‘సర్’ నిర్వహించే అధికారం ఉందని పేర్కొంది.
చట్టబద్దమైన మద్దతు..
‘‘చట్టబద్దమైన పద్దతిలో చట్టమే ఎప్పుడైనా నమోదు చేయాల్సిన కారణాలతో, ఎన్నికల సంఘం తగినదిగా భావించే పద్దతిలో ప్రత్యేక పునర్విమర్శకు అధికారం ఇచ్చినప్పుడూ సాధారణ పునర్విమర్శ కోసం ఉద్దేశించిన సాధారణ పద్దతులకు అది అన్ని విధాలుగా అనుగుణంగా లేదనే కారణంతో మాత్రమే ఇది చెల్లనిదిగా ప్రకటించలేము’’ అని సీజేఐ పేర్కొన్నారు.
‘సర్’ ప్రజాప్రాతినిధ్య చట్టం, నిబంధనలను భర్తీ చేయలేదు. పైగా ఇది సెక్షన్ 21(3) ద్వారా అందించబడిన కచ్చితమైన శాసనబద్ద పరిధిలో ఆర్టికల్ 324 కింద రాజ్యాంగ ఆదేశానికి మూలం. అందువల్ల కమిషన్ తన శాసనబద్ద అధికారాలకు మించి వ్యవహరించిందని చెప్పలేమని సీజేఐ అన్నారు.
ఓటర్ల జాబితా సమగ్రత..
స్వేచ్చాయుత, నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించాలనే రాజ్యాంగ ఆదేశంతో సర్ నిర్వహణ తప్పనిసరని అత్యున్నత న్యాయస్థానం గమనించింది. ఎన్నికల నిర్వహణ అంటే కేవలం ఓటు వేయడానికి మాత్రమే పరిమితం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటర్ల జాబితా సమగ్రత, కచ్చితత్వం, విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుందని కోర్టు పేర్కొంది. ఇంతకుముందు చాలాకాలం క్రితం సర్ జరిగిందని, కాలక్రమేణా ఓటర్ల జాబితాలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయని వాటిని సరి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే అని సుప్రీంకోర్టు పేర్కొంది.
నేపథ్యం.. పిటిషన్లు..
కోర్టు సర్ ప్రక్రియపై ఎలాంటి స్టే ఇవ్వలేదు. ఈ ప్రక్రియ ఇప్పటికే బీహార్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ లో పూర్తయింది. త్వరలో తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్ సహ అనేక రాష్ట్రాలలో జరగనుంది. ఈ ప్రక్రియ కొనసాగించడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై జనవరి 29నే కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
బీహార్ సర్ ప్రక్రియ ప్రారంభించాలని ఈసీ తీసుకున్న నిర్ణయంపై గత ఏడాది జూన్ లో అనేక పిటిషన్ల దాఖలు అయ్యాయి. ఈ కేసులో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, మహువా మొయిత్రా, మనోజ్ ఘా(ఆర్జేడీ ఎంపీ), కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్ ఎంపీ),సూప్రియా సూలే(ఎన్సీపీ ఎంపీ) తదితరులు ఉన్నారు.
Next Story

