
ఎన్నికల అధికారులతో మాట్లాడుతున్న ఈసీ ప్రధాన కమిషనర్ సి.సుదర్శన్ రెడ్డి
ఈ నెల 25 నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ...పోలీసు బందోబస్తు
తెలంగాణలో అధికారుల సన్నాహాలు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను విజయవంతం చేసేందుకు ఫీల్డ్ స్థాయిలో విధులు నిర్వహించే బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లకు తగిన భద్రత సహకారం అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి కోరారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పోలీసులు పెట్రోలింగ్ ను నిర్వహించాలని సంబంధిత పోలీసు అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్
ఈ సందర్భంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో మంగళవారం ఐఏఎస్, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా.వాసం వెంకటేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఈనెల 25వతేదీ నుంచి ప్రారంభం అవుతుందని, కావున బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, తిరిగి వాటిని సేకరించాలని ఆయన సూచించారు.ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో పాల్గొనే బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్ల పేర్లను, ఫోన్ నెంబర్లను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు.
పోలీసు భద్రత కల్పిస్తాం
ఎస్‌ఐఆర్ సర్వే ప్రక్రియ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జగరకుండా పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించుకోవాలని డీఈఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ విధుల్లో పాల్గొనే అన్ని బీఎల్‌ఓలు, ఇతర అధికారులకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కమిషనర్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు, ఆయా జిల్లాల పోలీస్ కమిషనర్లు, డిప్యూటీ సీఈఓ నోడల్ అధికారులు పాల్గొన్నారు
Next Story

