
హైదరాబాద్ ఓటర్ల సర్వేలో జాప్యం! అసలు ఏం జరుగుతోంది?
గడువులోగా ప్రక్రియ పూర్తవుతుందా....
రచ్చ - రాజకీయం @ 5 పి.ఎం
1) హైదరాబాద్‌లో నెమ్మదిగా SIR ప్రక్రియ.. అసలు ఏం జరుగుతోంది?
2) తెలంగాణకు కరువు గండం..!462 మండలాల్లో లోటు వర్షపాతం
3) పురానాపూల్‌కు నయా లుక్..! హెరిటేజ్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం
1) హైదరాబాద్ ఓటర్ల సర్వేలో జాప్యం! అసలు ఏం జరుగుతోంది?
పోలింగ్ రోజు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావాలా వద్దా అనేది ఓటరు నిర్ణయం. కానీ SIRలో BLO ఇంటికే వస్తారు. అయినప్పటికీ నగర జీవనశైలి, అపార్ట్‌మెంట్ సంస్కృతి, వలస జనాభా, సిబ్బంది కొరత వంటి కారణాలతో వివరాల సేకరణ ఆలస్యమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ వేగంగా సాగుతున్నప్పటికీ... హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల పట్టణ జిల్లాల్లో మాత్రం SIR ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్... అంటే SIR ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎన్నికల సంఘం లక్ష్యం ఒక్కటే... అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండాలి... అనర్హుల పేర్లు తొలగాలి... చిరునామా మారిన వారు, కొత్తగా అర్హత పొందిన వారు, మరణించిన వారి వివరాలు సక్రమంగా నమోదవ్వాలి.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం... తెలంగాణలో మొత్తం 3 కోట్ల 38 లక్షల 26 వేల 448 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయింది.
ఇప్పటి వరకు 2 కోట్ల 19 లక్షల 23 వేల 435 ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. అంటే మొత్తం ప్రక్రియలో 64.81 శాతం పూర్తైంది. రాష్ట్ర సగటును పరిశీలిస్తే ఇది సంతృప్తికరంగానే కనిపిస్తున్నా... జిల్లా వారీగా చూస్తే మాత్రం స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్ నగరం, దాని పరిసర పట్టణ జిల్లాల్లో డిజిటలైజేషన్ చాలా మందగించింది.
తాజా గణాంకాల ప్రకారం... మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కేవలం 37.30 శాతం, హైదరాబాద్ జిల్లాలో 40 శాతం, రంగారెడ్డి జిల్లాలో 48.52 శాతం మాత్రమే ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇవన్నీ రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ.
అదే సమయంలో గ్రామీణ జిల్లాలు మాత్రం ఈ ప్రక్రియలో దూసుకుపోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా 88.43 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. తర్వాత సిద్దిపేట 83.55 శాతం, నల్లగొండ 82.74 శాతం, కుమ్రంభీం ఆసిఫాబాద్ 81.63 శాతంతో ముందంజలో ఉన్నాయి.
SIR ప్రక్రియలో BLOలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి. మళ్లీ వాటిని సేకరించాలి. ఆ తర్వాత వివరాలను ధృవీకరించి డిజిటల్ సిస్టంలో నమోదు చేయాలి. కానీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి భారీ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఒక్కో BLO పరిధిలో వేలాది మంది ఓటర్లు ఉండటంతో పని భారం పెరిగింది. కొన్ని చోట్ల సిబ్బంది కొరత కూడా ప్రభావం చూపుతోంది.ఫారాల ముద్రణలో వచ్చిన సమస్యలు.
కొన్ని నియోజకవర్గాల్లో తొలుత కేవలం తెలుగు భాషలో మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు ముద్రించారు. తర్వాత ఆంగ్ల భాషలో కూడా అవసరం ఉండటంతో మళ్లీ ముద్రించాల్సి వచ్చింది. దీంతో ప్రారంభ దశలోనే కొంత ఆలస్యం ఏర్పడింది.
రాజకీయ పార్టీల సహకారం పూర్తిస్థాయిలో లేకపోవడం
కొన్ని ప్రాంతాల్లో బూత్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనకపోవడంతో... ఫారాల సేకరణ ఆశించినంత వేగంగా జరగలేదని అధికారులు చెబుతున్నారు.
సైబర్ మోసాల భయం.ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరగడంతో... SIR పేరుతో వ్యక్తిగత వివరాలు, OTPలు అడుగుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తరించింది. దీంతో కొంతమంది ఓటర్లు నిజంగా వచ్చిన BLOలను కూడా అనుమానించి వివరాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. అయితే ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్న విషయం ఏమిటంటే... BLOలు ఎట్టి పరిస్థితుల్లోనూ OTPలు లేదా బ్యాంకు వివరాలు అడగరు. అలాంటి కాల్స్ వస్తే వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.
ఇక ఈ జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం SIR షెడ్యూల్‌లో మార్పులు చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం... ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అనంతరం ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు, సవరణలు పరిశీలించిన తర్వాత అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.
అధికారుల ప్రకారం... హైదరాబాద్‌లో ప్రక్రియను వేగవంతం చేసేందుకు అదనపు సిబ్బందిని వినియోగించడం, ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి.ప్రజలకు కూడా అధికారులు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నారు. BLOలు ఇంటికి వచ్చినప్పుడు అవసరమైన వివరాలు అందించి సహకరించాలని... అదే సమయంలో SIR పేరుతో OTPలు, బ్యాంకు వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారం అడిగే అనుమానాస్పద కాల్స్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి... రాష్ట్రవ్యాప్తంగా SIR ప్రక్రియ సగానికి పైగా పూర్తయినప్పటికీ, హైదరాబాద్‌తో పాటు పట్టణ జిల్లాల్లో వేగం పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ జాప్యాన్ని అధికారులు ఎంతవరకు అధిగమిస్తారు... సవరించిన గడువులోగా ప్రక్రియ పూర్తవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2) పురానాపూల్‌కు నయా లుక్..! 448 ఏళ్ల వారసత్వానికి గ్రాండ్ మేకోవర్..!
హైదరాబాద్‌లోని 448 ఏళ్ల చారిత్రక కట్టడం పురానాపూల్ త్వరలో సరికొత్త రూపులో కనిపించనుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ వంతెనను హెరిటేజ్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా పురానాపూల్‌పై వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ట్రాఫిక్-ఫ్రీ పెడెస్ట్రియన్ జోన్‌గా మార్చనున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేక వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్‌లు, కూర్చునే సదుపాయాలు, ల్యాండ్‌స్కేపింగ్ ఏర్పాటు చేయనున్నారు. రాత్రివేళల్లో ప్రత్యేక ఆర్కిటెక్చరల్ లైటింగ్‌తో పురానాపూల్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దనున్నారు. అదే సమయంలో వారసత్వానికి ఎలాంటి నష్టం కలగకుండా పురావస్తు, సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. వంతెనపై ఉన్న 22 రాతి ఆర్చ్‌లు, గోడలను ప్రత్యేక రసాయనాలతో శుభ్రపరిచి అసలు రూపును తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పురానాపూల్‌ను కుతుబ్‌షాహీ పాలకుడు ఇబ్రహీం కులీ కుతుబ్‌షా సుమారు 1578లో నిర్మించాడు. సుమారు 600 మీటర్ల పొడవు, 35 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తుతో, 22 భారీ రాతి ఆర్చ్‌లపై నిర్మించిన ఈ వంతెన శతాబ్దాలుగా వరదలను తట్టుకుని నేటికీ చెక్కుచెదరకుండా నిలిచి ఉంది.
పురానాపూల్ గురించి ఒక ప్రేమగాథ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. యువరాజు ముహమ్మద్ కులీ కుతుబ్‌షా తన ప్రియురాలు భాగమతిని కలవడానికి ముసీ నదిని దాటేవాడని, కుమారుడి భద్రత కోసం ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ఈ వంతెన నిర్మించాడని జానపద కథ చెబుతుంది.
అయితే ఇది చారిత్రకంగా నిర్ధారితమైన విషయం కాదు. ఎక్కువ మంది చరిత్రకారులు దీనిని జానపద గాథగానే పరిగణిస్తారు. ఎందుకంటే పురానాపూల్ నిర్మాణం పూర్తయ్యే సమయానికి ముహమ్మద్ కులీ కుతుబ్‌షా వయస్సు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి ప్రేమకథ కారణంగానే వంతెన నిర్మించారనే వాదనకు స్పష్టమైన ఆధారాలు లేవు.
చరిత్ర చెబుతున్న వాస్తవం ఏమిటంటే... పురానాపూల్ నిర్మాణం వెనుక ప్రధాన ఉద్దేశం ముసీ నదిపై సురక్షిత రాకపోకలు కల్పించడం. గోల్కొండ కోట నుంచి నదికి ఆవల ఉన్న గ్రామాలు, వ్యవసాయ ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలకు వెళ్లేందుకు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రజలు, వ్యాపారులు, సైన్యం సురక్షితంగా ప్రయాణించేందుకు ఈ బలమైన రాతి వంతెనను నిర్మించారు.
ఆ రోజుల్లో గోల్కొండ కేవలం ఒక కోట కాదు. అది రాజభవనాలు, బజార్లు, మసీదులు, ఉద్యానవనాలు, ప్రపంచ ప్రసిద్ధ వజ్రాల వ్యాపారంతో కళకళలాడిన రాజధాని నగరం. కాలక్రమేణా జనాభా పెరగడంతో కొత్త రాజధాని అవసరం ఏర్పడింది.
ఇబ్రహీం కులీ కుతుబ్‌షా నిర్మించిన పురానాపూల్ ద్వారా ఏర్పడిన అనుసంధానం తర్వాత, ఆయన కుమారుడు ముహమ్మద్ కులీ కుతుబ్‌షా 1591లో ముసీ దక్షిణ తీరంలో చార్మినార్‌ను కేంద్రంగా చేసుకుని హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పురానాపూల్ గోల్కొండను కొత్త రాజధానితో కలిపే కీలక వారధిగా మారింది.
నాలుగున్నర శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ పురానాపూల్... ఇప్పుడు మరోసారి కొత్త అందాలతో, ఆధునిక సౌకర్యాలతో, హెరిటేజ్ టూరిజం హబ్‌గా పునర్జన్మ పొందేందుకు సిద్ధమవుతోంది. చరిత్రను కాపాడుతూ... భవిష్యత్ తరాలకు పరిచయం చేసే వారసత్వ చిహ్నంగా పురానాపూల్ మరోసారి హైదరాబాద్ గుర్తింపుగా నిలవనుంది.
3) తెలంగాణను వెంటాడుతున్న కరవు..! వాన కోసం ఎదురుచూపులు..
తెలంగాణలో వానాకాలం సగం పూర్తయింది. కానీ వరుణుడు మాత్రం ఇంకా ముఖం చాటేశాడు. సాధారణంగా జూలై నెల అంటే రైతులకు ఆశలు నింపే కాలం. చెరువులు నిండాలి... వాగులు, వంకలు పారాలి... పొలాల్లో పచ్చదనం కనిపించాలి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావం తీవ్రంగా ఉండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖరీఫ్ పంటల భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతోంది.
తాజా గణాంకాలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.వాతావరణ శాఖ లెక్కల ప్రకారం... జూన్ 1 నుంచి జూలై 19 వరకు తెలంగాణలో సాధారణంగా 254.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. కానీ వాస్తవానికి కురిసింది మాత్రం 170.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే. అంటే రాష్ట్రవ్యాప్తంగా 33 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. ఈ లోటు ప్రభావం ఇప్పుడు నేరుగా వ్యవసాయంపై పడుతోంది.రాష్ట్రంలోని మొత్తం మండలాలను పరిశీలిస్తే... 462 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే... 78 మండలాల్లో ఇప్పటి వరకు ఒక్క చుక్క వాన కూడా పడలేదు. వానాకాలం సగం దాటినా కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికీ ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు.
రాష్ట్రంలో కేవలం 133 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లా ఒక్కటే సాధారణం కంటే 2 శాతం అధిక వర్షపాతం నమోదు చేసింది. మిగిలిన దాదాపు అన్ని జిల్లాలు లోటు వర్షపాతంతోనే కొనసాగుతున్నాయి.
కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.యాదాద్రి భువనగిరి జిల్లాలో 63 శాతం వర్షపాతం లోటు నమోదైంది. ఆ తర్వాత మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 60 శాతం, వనపర్తి, నిర్మల్ జిల్లాల్లో 58 శాతం, వరంగల్ జిల్లాలో 55 శాతం, హనుమకొండ జిల్లాలో 54 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
ఈ జిల్లాల్లో ఇప్పటికే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది రైతులు విత్తనాలు వేశారు. కానీ వర్షాలు లేకపోవడంతో ఆ విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని చోట్ల మొలకెత్తిన పంటలు కూడా ఇప్పుడు నీటి కొరతతో వాడిపోతున్నాయి.
దీనికి ప్రధాన కారణం... డ్రై స్పెల్, అంటే వర్షాల మధ్య ఎక్కువ రోజుల విరామం. సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో మధ్య మధ్యలో వర్షాలు పడుతూ ఉండాలి. అలా పడితే నేలలో తేమ నిల్వ ఉంటుంది. కానీ ఈసారి వర్షాలు పడినా... ఆ తర్వాత చాలా రోజుల పాటు మళ్లీ వాన లేకపోవడంతో నేల పూర్తిగా ఎండిపోతోంది. ఫలితంగా పంటలు ఎదగలేని పరిస్థితి ఏర్పడుతోంది.
గత 50 రోజుల్లో తెలంగాణలో సగటున కేవలం 24 రోజులే వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.జోగులాంబ గద్వాల జిల్లాలో కేవలం 8 రోజులే వర్షం పడింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో కేవలం 9 రోజులే వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోనే 42 శాతం వర్షపాతం లోటు నమోదవడం గమనార్హం.
ఇంకో ఆందోళనకర అంశం ఏమిటంటే... వర్షాలు అత్యధికంగా కురవాల్సిన జూలై నెలలోనే 53 శాతం వర్షపాతం లోటు నమోదైంది. సాధారణంగా జూలైలో చెరువులు నిండిపోవాలి. కానీ ఇప్పుడు అనేక చెరువుల్లో నీటి మట్టం పడిపోతోంది. సాగునీటి సమస్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభావం కేవలం వ్యవసాయంపైనే కాదు. తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, పశువుల మేత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టు, సెప్టెంబర్ నెలలపైనే ఉంది. ఈ రెండు నెలల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే కొంతవరకు పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ ఏడాది తెలంగాణలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరవు ప్రభావం కేవలం రైతులకే పరిమితం కాదు. మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే దీని ప్రభావం పడుతుంది. మొదటగా వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. పంటలు ఎండిపోవడం, దిగుబడులు తగ్గడం వల్ల రైతులు నష్టపోతారు. దీంతో మార్కెట్‌కు వచ్చే ధాన్యాలు, కూరగాయలు, పప్పుధాన్యాల సరఫరా తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
వర్షాభావంతో చెరువులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గి తాగునీటి సమస్య తీవ్రం కావచ్చు. భూగర్భ జలాలు కూడా పడిపోతాయి. పశువులకు మేత, నీటి కొరత ఏర్పడుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గడంతో కూలీలకు ఉపాధి దెబ్బతింటుంది. పరిశ్రమలకు ముడిసరుకు కొరత ఏర్పడుతుంది. మరోవైపు రైతులకు పరిహారం, తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనుల కోసం ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.
సామాన్య ప్రజలపై కూడా కరవు ప్రభావం ఉంటుంది. కూరగాయలు, పప్పులు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. తాగునీటి సమస్య, జీవన వ్యయం కూడా పెరగవచ్చు.అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మంచి వర్షాలు కురిస్తే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది. లేకపోతే కరవు ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత తీవ్రంగా పడే ప్రమాదం ఉంది. మొత్తానికి... వానాకాలం సగం పూర్తయినా వరుణుడు కరుణించకపోవడంతో తెలంగాణ రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఖరీఫ్ సీజన్ భవిష్యత్తు... రైతుల ఆశలు... చెరువుల నీటి నిల్వలు... అన్నీ ఇప్పుడు రానున్న రెండు నెలల వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఆకాశం కరుణిస్తేనే పంటలు నిలుస్తాయి... లేకపోతే కరవు ముప్పు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.

