
బండి భగీరథ్‌పై పోక్సో కేసు.. సిట్ దర్యాప్తుకు సీఎం ఆదేశం
పేట్‌బషీరాబాద్‌లో నమోదైన కేసుపై ప్రత్యేక బృందాలతో సమగ్ర విచారణ జరపాలని డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం డీజీపీని ప్రశ్నించినట్లు సమాచారం.
దీనికి స్పందించిన డీజీపీ, ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన భద్రతా ఏర్పాట్లలో పోలీసు సిబ్బంది బిజీగా ఉన్నారని వివరించినట్లు తెలుస్తోంది. అనంతరం కేసు పూర్తి వివరాలను సీఎంకు నివేదించారు. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ప్రకారం, 17 ఏళ్ల బాలికను భగీరథ్ వేధిస్తున్నారని ఆమె తల్లి ఆరోపించారు. దీంతో పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12తో పాటు బీఎన్‌ఎస్ 74, 75 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదే సమయంలో మరో మలుపు కూడా చోటుచేసుకుంది. బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం బెదిరిస్తున్నారని భగీరథ్ కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు సున్నితమైనదిగా భావించిన పోలీసులు మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో విచారణ కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఆధారాల సేకరణ ప్రారంభించినట్లు సమాచారం.
బాలిక వాంగ్మూలాన్ని చట్టపరమైన నిబంధనల ప్రకారం నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్ రెడ్డి సీపీ నుంచి పూర్తి వివరాలు తెప్పించుకుని ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కేసులో అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుండగా, తదుపరి పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

