ఒక్కరోజు జైలులో గడపాలనుకుంటున్నారా ? రు. 500 చెల్లిస్తే చాలు
x

ఒక్కరోజు జైలులో గడపాలనుకుంటున్నారా ? రు. 500 చెల్లిస్తే చాలు

రు 5 వందల రూపాయలు చెల్లించిన వారికి ఒక్కరోజు జైలు జీవిత అనుభవాన్ని పరిచయంచేయాలని డిసైడ్ అయ్యింది


టీవీల్లో ఒక ప్రకటన వస్తుంటూంది ‘‘లడ్డూకావాలా నాయన’’ అని. అలాగే మీకు జైలులో గడపాలని ఉందా నాయనా అని తెలంగాణ జైళ్ళశాఖ అడుగుతోంది. నమ్మబుద్ది కావటంలేదా ? వినటానికే విచిత్రంగా ఉందా ? అయినా సరే జేబులో రు. 500 ఉంటేచాలు జైలుజీవితం ప్రాప్తిరస్తు అని జైళ్ళశాఖ దీవిస్తుంది. చాలామంది జైలుగురించి వినుంటారు లేకపోతే సినిమాల్లో చూసుంటారంతే. నిజజీవితంలో తప్పులు చేసినవారికి తప్ప ఇతరులకు జైలు జీవితం ఎందుకు ప్రాప్తిస్తుంది. అందుకనే తెలంగాణ జైళ్ళశాఖ ఒక వినూత్న ఆలోచనచేసింది. అదేమిటంటే రు 5 వందల రూపాయలు చెల్లించిన వారికి ఒక్కరోజు జైలు జీవితాన్ని అనుభవాన్ని పరిచయంచేయాలని డిసైడ్ అయ్యింది. అంటే ఒకరోజు అద్దెకు జైలు జీవితం అనుకోండి.

సాధారణ జనాలకు జైలు జీవితం ఎలాగుంటుందో అనుభవపూర్వకంగా తెలియజేసేందుకు రు. 500 ఫీజుతో ఒకరోజు జైలులో గడిపే బంపర్ ఆఫర్ ను తొందరలోనే అమల్లోకి తెస్తోంది. జైళ్ళల్లో నేరస్తులు, విచారణ ఖైదీలు మగ్గుతూ ఉంటారు. సినిమాల్లో జైళ్ళ సన్నివేశాలను చూసినపుడల్లా చాలామంది ‘‘అబ్బ అన్నేసి సంవత్సరాలు జైలులో ఎలా మగ్గిపోతారో పాపం’’ అనే సానుభూతితో ఆలోచిస్తుంటారు. అయితే మామూలు జనాలకు అసలు జైలులో ఎలాగ ఉంటుందో తెలిసే అవకాశం ఎంతమాత్రం లేదు.

అందుకనే హైదరాబాద్ లోని ‘‘చంచల్ గూడ సెంట్రల్ జైల్ వేదికగా ఒక్కరోజు జైలు జీవితం’’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఉన్నతాధికారులు ప్రారంభించబోతున్నారు. ఏదో జైలు చూడటానికి ఒక్కరోజు 500 రూపాయలు కట్టాము కాబట్టి సరదాగా వెళ్ళొద్దామని అనుకుంటే మాత్రం కష్టమే. ఎందుకంటే జైలులోకి వెళ్ళిన వ్యక్తికి తన బట్టలు వదిలేసి అధికారులు ఇచ్చే ఖాకీ యూనీఫామ్ మాత్రమే వేసుకోవాలి. మొబైల్ ఫోన్లు, వాచీలే కాదు మరే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కూడా అనుమతించరు.

ఒక్కరోజు జైలు జీవితం అని పేరుకుమాత్రమే. ఒకసారి 500 రూపాయలు చెల్లించి జైలులోకి వెళితే మిగిలిన ఖైదీల్లాగేనే ట్రీట్ చేస్తారు. తెల్లవారుజామునే నిద్రలేవటం, జైలు మాన్యువల్ ప్రకారం అందించే పప్పు, అన్నం, చారు లాంటి సాదాసీదా భోజనం మాత్రమే తినాలి. అధికారులు చెప్పే తోటపనులు, వంటపనులు, బాత్రూములను శుభ్రంచేయటం లాంటి పనులూ తప్పవు. పడుకోవటానికి మంచాలు, పరుపులుండవు నేలపై ఒక దుప్పటిపరుచుకుని దిండు పెట్టుకుని పడుకోవాల్సుంటుంది. ఇక బాత్ రూమ్ అంటారా మిగిలిన ఖైదీలు ఉపయోగించే బాత్ రూమ్ లనే అద్దె వ్యక్తులు కూడా ఉపయోగించుకోవాల్సుంటుంది. జైళ్ళ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయి ? అధికారులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు ? జైళ్ళల్లో ఖైదీల దినచర్య ఎలాగుంటుంది ? అన్న విషయాలపై మామూలు జనాలను చైతన్య పరిచేందుకు మాత్రమే జైళ్ళశాఖ ఉన్నతాధికారులు ఇలా రు. 500కి ఒక్కరోజు జైలు జీవితం అనే కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఏప్రిల్ నెలలోనే మొదలవ్వాల్సిన ఈ కార్యక్రమం ఈ మేనెలలో అయినా ప్రారంభమవుతుందేమో చూద్దాం.

Read More
Next Story