వాట్సాప్‌కే SSC రిజల్ట్స్: ఎలా చెక్ చేసుకోవాలంటే..!
x

వాట్సాప్‌కే SSC రిజల్ట్స్: ఎలా చెక్ చేసుకోవాలంటే..!

మీ సేవ చాట్‌బాట్ ద్వారా ఫలితాలు సులభంగా పొందే అవకాశం. హాల్ టికెట్ నంబర్‌తో వెంటనే మార్కుల మెమో పొందవచ్చు.


తెలంగాణ పదో తరగతి ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఫలితాలను చూసుకోవడానికి విద్యార్థులు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే చూసుకునే వెసులుబాటు తీసుకొచ్చిందిన ప్రభుత్వం. రేపు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఎస్సెస్సీ ఫలితాలు నేరుగా వాట్సాప్‌లో పొందే అవకాశం కల్పించారు. ఇకపై ఫలితాల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర నుంచే సెల్‌ఫోన్‌లో కొన్ని క్షణాల్లో మార్కులు తెలుసుకోవచ్చు.

తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం ఈ సేవను అందిస్తోంది. 2026 ఎస్సెస్సీ ఫలితాలను మీ సేవ వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోనున్నారు. ఈ సేవను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌తో కలిసి అమలు చేస్తున్నారు. వెబ్‌సైట్లలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా, వేగంగా ఫలితాలు అందేలా ఈ విధానం తీసుకొచ్చారు.

విద్యార్థులు ముందుగా 8096958096 నంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పంపాలి. ఆపై ‘SSC Result’ అని టైప్ చేయాలి. మెనులో ఉన్న ఎంపికను క్లిక్ చేసి హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి. వివరాలు పంపిన వెంటనే మార్కుల మెమో వాట్సాప్‌లో వస్తుంది. ఈ విధానం ద్వారా పేపర్‌లెస్ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. క్యూలు లేకుండా సులభంగా ఫలితాలు పొందే అవకాశం కల్పించారు.

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో మీ సేవ సేవలు విస్తరిస్తున్నాయి. ప్రజలకు మరింత సౌకర్యంగా సేవలు అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. 2025 నవంబర్‌లో ప్రారంభమైన ఈ వాట్సాప్ చాట్‌బాట్‌కు మంచి స్పందన వచ్చింది. జనన సర్టిఫికేట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యుత్ బిల్లులు, పోలీస్ చలాన్లు, ఇంటర్ ఫలితాలు వంటి సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

Read More
Next Story