
పునరావాసం కల్పించాలని కోరుతూ సోమవారం ర్యాలీ తీస్తున్న గిరిజనులు
అడవిలోనే ఉండాలా? బయటకు రావాలా? అమ్రాబాద్ గిరిజనుల్లో చీలిక
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పునరావాసంపై గిరిజనుల్లో భిన్న స్వరాలు : గిరిజనుల భారీ ర్యాలీ
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కొన్ని అటవీ గ్రామాల గిరిజనుల్లో రెండు అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒక వర్గం పునరావాసం వెంటనే జరగాలని కోరుతూ ర్యాలీ నిర్వహించగా, మరో వర్గం మాత్రం అడవిలోనే ఉండాలని, పులులతో సహజీవనం కొనసాగించాలని భావిస్తోంది.
పునరావాసం కల్పించాలని గిరిజనుల ర్యాలీ
పునరావాసం ప్రక్రియ వేగవంతం చేయాలంటూ నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని సర్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపెంట, తాటిగుండల్‌పెంట గ్రామాల గిరిజనులు సోమవారం ర్యాలీ తీశారు. పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ సోమవారం జరిపిన ర్యాలీలో 200 కుటుంబాలకు పైగా గిరిజన, గిరిజనేతర గ్రామస్థులు పాల్గొన్నారు. వై జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అచ్చంపేట అటవీ విభాగాధికారి కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా గ్రామస్థులు పునరావాసానికి మద్దతుగా నినాదాలు చేశారు.
అడవి నుంచి వస్తాం : గిరిజనులు
అనంతరం అటవీ గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ, పునరావాసానికి తమ ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగానే సిద్ధమయ్యామని, అడవుల్లో నివసించడం వల్ తమ పిల్లల విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ఉండాల్సి వస్తోందని, దీనివల్ల తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి ప్రదేశంలో పునరావాసం కల్పించాలని తామే కోరుకుంటున్నామని, బయటకు రావడానికి మేమే ముందుకు వచ్చామని స్పష్టం చేశారు.
గ్రామాల తరలింపునకు అంగీకరించాం
అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించి తమ అభిప్రాయాలు నమోదు చేసినట్లు గిరిజనులు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా పునరావాస కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులను తరచూ కలుస్తూ వస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, జిల్లా అటవీ అధికారి దగ్గరనుంచి హైదరాబాద్ లో ఉన్న అటవీ ప్రధాన సంరక్షణాధికారిణి, ముఖ్య కార్యదర్శి , ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి తదితరులను పలుమార్లు కలిసి తమ గ్రామాల పునరావాసాన్ని స్వచ్ఛంద సమ్మతితో త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
అటవీశాఖ అధికారికి వినతిపత్రం
ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు తమకు నచ్చాయని, అందుకే పునరావాస ప్యాకేజీకి అంగీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పూర్తి విశ్వాసం ఉందని, అవసరమైతే అదనపు సదుపాయాల కోసం తామే ప్రభుత్వాన్ని కోరుతామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్యాకేజీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్థులు జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్రకు వినతిపత్రం సమర్పించారు. పునరావాస ప్రక్రియను గ్రామస్థుల అభిప్రాయాలకు అనుగుణంగా చేపట్టి త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామస్థులు శాంతి, సహకారం పాటించాలని సూచించారు.
Next Story

