కుట్టుమిషన్ పథకంపై కట్టుదిట్టమైన గైడ్‌లైన్స్ కావాలి: ఫోరం
x
బీసీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు

కుట్టుమిషన్ పథకంపై కట్టుదిట్టమైన గైడ్‌లైన్స్ కావాలి: ఫోరం

పథకాలు కాదు, ఫలితాలే ముఖ్యం: ప్రభుత్వానికి సూచనలు


సంక్షేమ పథకాల పేరిట ప్రజాధన దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు అవసరమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గతంలో దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాల అమలులో జరిగిన లోపాలను దృష్టిలో ఉంచుకుని, బీసీ మహిళలకు ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్ల పంపిణీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కోరింది.

సంక్షేమ పథకాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచించింది. గత బీఆర్ఎస్ పాలనలో దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాల్లో నిధుల దుర్వినియోగం జరిగిన నేపథ్యంలో బీసీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పలు సూచనలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గానికి చెందిన మహిళలకు ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్లను సరఫరా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికతో సహా పథకం అమలు కోసం విపులమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేయి ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించి, టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధిని ప్రోత్సహించనున్నారు.ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా బీసీ మహిళలకు సరైన శిక్షణ ఇవ్వాలని ఫోరం సూచించింది. మార్కెటింగ్ కోసం గార్మెంట్ ఫ్యాక్టరీలతో అనుసంధానం చేయాలని, గత పథకాలలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా ఉండేందుకు, అమలు సంస్థలకు తగిన సూచనలు జారీ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌరవ ముఖ్యమంత్రికి సూచించింది.

దళిత బంధు పథకం విఫలం

దళిత బంధు పథకం తెలంగాణలో ద‌ళిత‌. కుటుంబాల స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయాన్ని పెంచేందుకు ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి ఒకసారి రూ. 10 లక్షల మూలధన సహాయం అందించారు. సూచించిన కార్యకలాపాలు పౌల్ట్రీ, డెయిరీ, రవాణా రంగం, తయారీ పరిశ్రమ, రిటైల్ దుకాణాలు పెట్టించారు. ఈ పథకం మొదట తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో స్యాచురేషన్ మోడ్‌లో అమలు చేశారు. గ్రామంలోని అన్ని ద‌ళిత‌ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు అందించారు. వారిలో చాలామంది కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేయగా, కొందరు అనుభవం లేకుండా పౌల్ట్రీ, డెయిరీ కార్యకలాపాలను ప్రారంభించారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాసాలమర్రి గ్రామంలో నిర్వహించిన సర్వేలో తేలింది.సరైన శిక్షణ లేకపోవడం వల్ల లబ్ధిదారులు కొనుగోలు చేసిన ఆస్తులను సరిగా వినియోగించలేకపోయారని,. కొంతకాలం తర్వాత వాటిని అతి తక్కువ ధరలకు విక్రయించారని ఫోరం పర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. కోళ్లఫారాలు, డెయిరీ యూనిట్లు కూడా ఆదాయం తీసుకురావడంలో విఫలమయ్యాయి. దీంతో ఈ పథకం పూర్తిగా విఫలమైందని, దళిత బంధు పథకంపై రూ.5 వేల కోట్లు ఖర్చు చేశారని, ఇది వృథా వ్యయంగా మారిందని ఫోరం పేర్కొంది.

గొర్రెల పంపిణీ పథకం అమలులో అక్రమాలు

తెలంగాణ ప్రభుత్వం నాలుగు లక్షల గొర్రెల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేయడానికి నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 11శాతంవడ్డీతో రూ.4000 కోట్ల రుణాన్ని తీసుకుంది. కానీ అవినీతి కారణంగా ఈ పథకం పూర్తిగా విఫలమైంది. దీనిపై ప్రభుత్వం సి.ఐ.డి. విచారణకు ఆదేశించిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి చెప్పారు. గత పథకాలలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా ఉండేందుకు, అమలు సంస్థలకు తగిన సూచనలు జారీ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రికి ఫోరం లేఖ రాసింది.
Read More
Next Story