
ఆర్టీసీ సమ్మెపై వీడని ఉత్కంఠ; కార్మిక నాయకులతో చర్చిస్తున్న ప్రభుత్వం
సమ్మెకు 24 గంటల ముందు దాని నివారణకు ఉపక్రమించిన ప్రభుత్వం
నలభై రెండు రోజుల ముందే కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిన ప్రభుత్వం ఈ రోజు అర్థరాత్రి నుండి ఆర్టీసీ సమ్మెను నివారించటానికి ఉపక్రమించింది. కార్మిక సంఘాల జేఏసీ తో చర్చలు జరిపేందుకు నలుగురు అధికారులతో కమిటీ వేసింది.
సమ్మె జరగటానికి మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండగా ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్.నెం.66 విడుదల చేసి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) (TGSRTC) ఉద్యోగుల నుంచి, వారి సేవా నిబంధనలు, సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుండి నాలుగు వారాల వ్యవధిలోగా ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించాలి. వినతులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, టీజీఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తోంది, అని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది.
ఈ కమిటీకి ఛైర్మన్ గా రవాణా, రహదారులు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సభ్యుడు గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, మరో సభ్యుడుగా, కన్వీనర్ గా వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ వ్యవహరిస్తారు.
ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని రవాణా శాఖ మంత్రి ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఆ ప్రకటనలో 65 లక్షల మంది ప్రయాణీకులకు ఇబ్బంది కలుగజేయవద్దనే కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు.
“నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి, నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వంగా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం. ఎలాంటి బేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి మీ సమస్యలు విన్నవించండి. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని ఆయన అన్నారు.
సమ్మెకు నోటిస్ ఇచ్చాక 30 రోజులలో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. సమస్య పరిష్కారం కాకపోతే 42 రోజుల లోపు కార్మికులు సమ్మెకు ఉపక్రమించాలి, లేదంటే మరో సారి నోటిస్ ఇచ్చి 30 రోజుల తరువాత నిబంధనల ప్రకారం స్ట్రైక్ కు వెళ్ళాలి, అని ఒక కార్మిక నాయకుడు తెలిపారు. ఆ గడువు ఏప్రిల్ 23 వ తారీఖున ముగుస్తుంది. అందుకే ఏప్రిల్ 22 నుంచి సమ్మె నోటిస్ ఇవ్వటం జరిగింది అని ఆయన తెలిపారు.

