
పెరుమాళ్ మురుగన్‌కు ‘మన్ బహదూర్ సింగ్ లాహక్ సమ్మాన్’
సమకాలీన తమిళ సాహిత్యంలో స్వతంత్ర స్వరంగా గుర్తింపు పొందిన మురుగన్‌కు ఇది మరో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచింది.
ప్రముఖ తమిళ రచయిత, సాహిత్య పరిశోధకుడు పెరుమాళ్ మురుగన్‌కు 2026 సంవత్సరానికి ‘మన్ బహదూర్ సింగ్ లాహక్ సమ్మాన్’ పురస్కారం లభించింది. ఇండియన్ లాంగ్వేజెస్ యూనిటీ ఫోరం (ILUF) ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని జూన్ 7వ తేదీ ఆదివారం ప్రకటించారు. సమకాలీన తమిళ సాహిత్యంలో స్వతంత్ర స్వరంగా గుర్తింపు పొందిన మురుగన్‌కు ఇది మరో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచింది. మురుగన్ పేరు దేశవ్యాప్తంగా చర్చకు రావడానికి ప్రధాన కారణం 2010లో పబ్లిష్ అయిన ‘మధోరుభాగన్’ అనే నవల.
ఆ నవలను అదే ఏడాది అనిరుధన్ వాసుదేవన్.. ఆంగ్లంలో ‘వన్ పార్ట్ ఉమెన్’ పేరుతో అనువదించారు. ఈ ట్రాన్స్‌లేటెడ్ వర్షన్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఒక గ్రామీణ దంపతుల జీవితాన్ని, సంతానం లేని జంట ఎదుర్కొనే సామాజిక ఒత్తిడిని ఈ నవల కళ్ళకు కట్టినట్లు చూపింది. ఈ పుస్తకంలోని కథ తిరుచెంగోడ్ దగ్గర్లోని అర్థనారీశ్వర ఆలయ ఉత్సవం నేపథ్యంలో కొనసాగుతోంది. ఒకానోకొ సందర్భంలో పొన్న అనే పాత్ర కుటుంబ ప్రోత్సాహం, ఆచారంలో భాగంగా ఒక తెలియని వ్యక్తి ద్వారా గర్భం దాల్చే ప్రయత్నం చేస్తే ఘట్టాన్ని వివరిస్తుంది. అంతేకాకుండా ఈ ఆచారం చారిత్రకంగా జానపద సంప్రదాయంలో పాతుకుపోయి ఉందని నవల వివరిస్తుంది.
ఈ పుస్తకం చుట్టూ ఒక దశలో వివాదాలు చెలరేగాయి. 2014-15 సమయంలో నమ్మక్కల్ లోని కొన్ని హిందూ సంఘాలు, కుల సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టాయి. రచయిత మురుగన్ క్షమాపణలు చెప్పాలని, ఈ పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఆయన రచయిత పెరుమాళ్ మురుగన్ మరణించారంటూ ఒక స్టేట్‌మెంట్ కూడా విడుదల చేశారు. ఆ ఒక్క ప్రకటన దేశవ్యాప్తంగా సాహిత్య ప్రపంచంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.
ఈ పుస్తకానికి సంబంధించిన కేసును మద్రాస్ హైకోర్టు విచారించింది. కాగా 2016లో మద్రాస్ హైకోర్టు భావప్రకటన స్వేచ్ఛకు మద్దతుగా ఇచ్చిన తీర్పుతో మురుగన్‌కు మరింత గుర్తింపు లభించింది. అనంతరం ఈ రచన అనేక సాహిత్య పురస్కారాలను సొంతం చేసుకుంది. 2018లో అనువదించబడిన సాహిత్యంగా నేషనల్ బుక్ అవార్డ్‌కు కూడా ఈ పుస్తకం లాంగ్‌లిస్ట్ అయింది.
అక్టోబర్ 15, 1966న నమక్కల్ జిల్లా రైతు కుటుంబంలో జన్మించిన మురుగన్ ఇప్పటివరకు 12 నవలలు, ఆరు కథా సంకలనాలు, ఆరు కవితా సంపుటాలు రచించారు. ఆయన రచించిన ‘పూక్కుళి’ (పైర్) అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లాంగ్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోగా, ‘ఫైర్ బర్డ్’ జేసీబీ సాహిత్య పురస్కారం అందుకుంది. తమిళ సాహిత్యాన్ని ప్రపంచ పాఠకులకు చేరవేసిన రచయితగా పెరుమాళ్ మురుగన్ ప్రత్యేక గుర్తింపు పొందారు.

