
తాండూరు కందులు : జీఐ ట్యాగ్ వచ్చినా గిట్టుబాటు ధర ఏది?
జీఐ ట్యాగ్ దక్కినా ధర దక్కని తాండూరు కందిపప్పు
బ్రాండింగ్ లోపాలు, యూనిక్ ఐడీ లేక తాండూరు కందిపప్పునకు ఇబ్బందులు, కాగితాల్లోనే కందిబోర్డు ఏర్పాటు
రుచితోపాటు పోషకాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే తాండూరు కందిపప్పు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ కూడా లభించినా, బ్రాండింగ్ లోపాలు, యూనిక్ ఐడీ లేకపోవడం, ఎగుమతుల వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదు.
తాండూరు ప్రాంత భూమిలో రైతులు పండిస్తున్న ఈ కందిపప్పు నాణ్యతతో పాటు త్వరగా ఉడికే స్వభావం ఉంది. తాండూరు కందిపప్పు విశిష్ఠతను గుర్తించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని జియోగ్రాపికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను మంజూరు చేసింది. ఢిల్లీ, ముంబయితో పాటు పప్పు ఎక్కువగా తినే దక్షిణాది రాష్ట్రాల్లో తాండూరు రకం కందిపప్పుకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఎక్కడ పండిస్తున్నారంటే...
తాండూరు కందిపప్పు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల్లోని కాగ్నా నదీ ఒడ్డున రైతులు పండిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ప్రత్యేకమైన సున్నపురాయి నేలలు,ఎర్ర,నల్ల నేలలు తాండూరు రకం కందిపప్పునకు ప్రత్యేక రుచితోపాటు, 24శాతం ప్రోటీన్‌ను అందిస్తాయి. ఈ తాండూరు రకం కంది సాగుకు అనువైన ఎర్రమట్టి, నల్లమట్టి. నేలలు అనుకూలం. తాండూరు రకం కందిపప్పునకు జీఐ ట్యాగ్ ను తాము సాధించామని తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జీఐ ట్యాగ్ వల్ల రైతులకు ధర పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
తాండూరు కందిపప్పునకు యూనిక్ ఐడీ ఏది?
తాండూరు కందిపప్పునకు 2020 సెప్టెంబరు 24వతేదీన భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయగా, 2022 డిసెంబరు 14వతేదీన 706 నంబరుతో జీఐట్యాగ్ లభించింది. తాండూరు ప్రాంతంలో 50 వేల ఎకరాలతోపాటు జిల్లా వ్యాప్తంగా 1.52 లక్షల ఎకరాల్లో 63,500 మంది రైతులు తాండూరు రకం కందులను పండడిస్తున్నారు. జీఐ ట్యాగ్ వచ్చినా తాండూరు కందిపప్పుకు వ్యవసాయ శాఖ అధికారులు యూనిక్ ఐడీని జారీ చేయలేదు. యూనిక్ ఐడీ వస్తే రైతులకు మంచి ధర లభిస్తుంది. ఈ ఏడాది తాండూరు రకం పండించే రైతులకు యూనిక్ ఐడీని జారీ చేస్తామని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి చెప్పారు.
తాండూరు కందిపప్పునకు బ్రాండింగ్ ఏది?
తాండూరు కందిపప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ లభించినా రైతులకు ఆశించిన ప్రయోజనాలు లభించడం లేదు.తాండూరు ప్రాంతంలో 1.52 లక్షల ఎకరాల్లో రైతులు తాండూరు రకం కందిపంటను సాగుచేస్తున్నా వ్యవసాయశాఖ అధికారులు యూనిక్ ఐడీని మాత్రం జారీ చేయలేదు.బ్రాండింగ్ లేకపోవడం,ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ లో లోపాలతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. తాండూరు కందిపప్పు ఎగుమతులకు సరైన వ్యవస్థ లేదు. దీంతో తాండూరు కంది రైతులకు ఆశించిన ధర లభించటం లేదు.గిట్టుబాటు ధర కంటే తక్కువ పలుకుతుందని కందిరైతులు ఆవేదనగా చెప్పారు.
కాగితాల్లోనే మగ్గుతున్న కందిబోర్డు
జీఐ ట్యాగ్ పొందిన తాండూరు కందిపప్పును విస్తారంగా పండిస్తున్న నేపథ్యంలో తాండూరు కేంద్రంగా కందిబోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. 2017వ సంవత్సరంలో తాండూరులో పర్యటించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పసుపుబోర్డు లాగా దాల్ బోర్డును తాండూరులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అది నెరవేర్చలేదు. తాండూరులో కందిబోర్డు ఏర్పాటు మూడు దశాబ్దాలుగా చెబుతున్నా కార్యరూపం దాల్చలేదు. ప్రస్థుతం కొడంగల్ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, తాండూరులో దాల్ బోర్డు ఏర్పాటు చేయలేదు. తాండూరు కంది ప్రాముఖ్యాన్ని పాఠ్యాంశాల్లో చేరుస్తామని అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి హామి ఇచ్చినా అదీ నెరవేరలేదు. కంది పంటపై వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో పరిశోధనలు సాగుతున్నా కంది దిగుబడులు పెంచే ఫలితాలు రాలేదు.తాండూరులో కంది బోర్డును వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని గతంలో పార్లమెంటులో అప్పటి ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండు చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా తాండూరు కేంద్రంగా దాల్ బోర్డు ఏర్పాటు చేయాలని యాలాల్ మండల రైతు సంఘాల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మరాట నర్సింహులు డిమాండ్ చేశారు.
ఆర్గానిక్ కందిపప్పు
సేంద్రీయ ఎరువులతో పండించిన తాండూరు కందిపప్పు రుచికరంగా ఉంటుంది. తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సేంద్రీయ ఎరువులతో పండించిన ఆర్గానిక్ కందులను మినీ దాల్ మిల్లులో పప్పు చేసి విక్రయిస్తున్నారు. ఆర్గానిక్ కందిపప్పునకు ఎంతో డిమాండ్ ఉంది. ఆర్గానిక్ తాండూరు కందిపప్పునకు క్యూఆర్ కోడ్ అమలు చేస్తే దేశీయ మార్కెట్ లో దీనికి డిమాండ్ పెరుగుతుందని తాండూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి చెప్పారు.
తాండూరు పేరుతో నాసిరకం కందిపప్పు విక్రయాలు
తాండూరు బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేలా కొందరు ఈ పేరుతో నాసిరకం కందులను, కందిపప్పును విక్రయిస్తుండటంతో అసలు తాండూరు రకం కందిపప్పు పండి స్తున్న రైతులకు నష్టం జరుగుతుంది. జీఐ ట్యాగ్ వచ్చాక తాండూరు కందిపప్పుల ధరల్లో ఒడిదొడుకుల వల్ల దాల్ మిల్లు వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. కందిపప్పు ధరల్లో మార్పుల వల్ల తాము నష్టాల పాలవుతున్నామని తెలంగాణ దాల్ మిల్లు వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షుడు కటకం వీరేందర్ ‘ ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
తాండూరులో మూతపడుతున్న మిల్లులు
తాండూరులో 14 కందిపప్పు మిల్లులుండగా ధరల ఒడిదొడుకుల వల్ల సగం మిల్లులు మూతపడ్డాయి. దాల్ మిల్లు యజమానులు ధరల తగ్దుతుండటం వల్ల నష్టపోతున్నారని తాండూరుకు చెందిన ఓ దాల్ మిల్లు వ్యాపారి వీరేందర్ చెప్పారు. జీఐ ట్యాగ్ లభించినా రాయితీలను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తాండూరు కందిపప్పు ఎగుమతి చేయడం లేదు. మిల్లులపై విద్యుత్ బిల్లుల భారం పెరిగిందని మిల్లు యజమానులు వాపోతున్నారు.
తాండూరు కందిపప్పు నాణ్యతకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నా, సరైన బ్రాండింగ్, యూనిక్ ఐడీ, కందిబోర్డు ఏర్పాటు వంటి అంశాల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం రైతులను నష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కరించి తాండూరు కందిపప్పునకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని రైతులు, నిపుణులు ఆశిస్తున్నారు.
Next Story

