2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం:సీఎం రేవంత్ రెడ్డి
x
పోలీసు వందనం స్వీకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం:సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం ప్రసంగం.. రైతుల సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి


2034 నాటికి తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్, 2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, “తెలంగాణ రైజింగ్-2047” విజన్ డాక్యుమెంట్ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచానికి గేట్‌వేగా మార్చాలన్న తన స్వప్నాన్ని వెల్లడించారు.

2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘దేశంలోనే కాదు... ప్రపంచానికే తెలంగాణను గేట్‌వే గా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ - 2047 డాక్యుమెంట్. దానికి ప్రజల అండదండలు కావాలి’’అని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ హితమే పరమార్ధంగా...

“పుట్టుక నీది... చావు నీది, బతుకంతా దేశానిది” అన్న ప్రజా కవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023 న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్ధంగా, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, పేదరికం నిర్మూలనే ప్రాధాన్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది’’అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యచరణ చేసుకుంటూ రెండున్నరేళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నామని సీఎం తెలిపారు.

పాలకులం కాదు సేవకులం...

‘‘మమ్మల్ని మేం పాలకులుగా అనుకోవడం లేదు. మీకు సేవకులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో పెత్తనం కాదు... నాలుగు కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి.. అని మేం భావిస్తున్నాం... బాధ్యతగా పని చేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు... ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నాం’’అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.



రైతులను శ్రీమంతులుగా చేయాలి

వ్యవసాయం - వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు - అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు తేవాలన్న సంకల్పంతో “తెలంగాణ రైజింగ్ - 2047” విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నామని సీఎం చెప్పారు. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన అని సీఎం తెలిపారు. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు, రైతు కూలీలే సారథులని, అగ్రికల్చరల్ ఏకో సిస్టమ్ అభివృద్ధి చేసి, రైతులను శ్రీమంతులుగా చేయాలన్న సంకల్ప పత్రం అని సీఎం రేవంత్ వివరించారు.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఈ నెలలోనే టిజిపిఎస్‌సి ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్, విద్యాశాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నోటిఫికేషన్‌ల జారీ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్‌లో విమానాశ్రయాల ఏర్పాటుకు మనం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆమోదం పొందామని సీఎం తెలిపారు. త్వరలోనే ఈ ఎయిర్ పోర్ట్ అభివృద్ది పనులు ప్రారంభమవుతాయని సీఎం వివరించారు.
రైతుల ఆదాయ వృద్ధి నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు, కొత్త విమానాశ్రయాల నిర్మాణం నుంచి సమగ్ర అభివృద్ధి వరకు విస్తృత లక్ష్యాలతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం స్పష్టం చేశారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్-2047” విజన్‌ను సాకారం చేసి, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
Read More
Next Story