
ఐఎండీ హైదరాబాద్ కేంద్రం విడుదల చేసిన వెదర్ చిత్రపటం (ఫొటో :ఐఎండీ)
అలర్ట్ తెలంగాణ: హీట్‌వేవ్‌తో పాటు పిడుగులు, వర్షాలు
పగలు మండే ఎండలు.. రాత్రి ఉరుములు: రైతులకు డబుల్ దెబ్బ
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా రెండు రూపాల్లో కనిపిస్తోంది. ఒకవైపు మండే ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, మరోవైపు సాయంత్రం వేళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితి ఏర్పడుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటుతుండగా, అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు, పిడుగుపాట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ద్వంద్వ వాతావరణ పరిస్థితులు రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలంగాణలో ఒకవైపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని, సాయంత్రానికి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటాయి.గడచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి.బుధవారం ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరో వైపు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్యనే కొనసాగుతాయని, కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
బుధవారం సాయంత్రం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌తో సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.
పిడుగు పడి రెండు గేదెలు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి చెందాయి. గ్రామ సర్పంచ్ పురుగుల యాదయ్య కథనం ప్రకారం, వంగూరు గ్రామానికి చెందిన రైతు పురుగుల శ్యామ్ పాడి గేదెలను చెట్టు కింద కట్టేసి ఉన్న సమయంలో వాటిపై పిడుగు పడింది. దీంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సంఘటనతో తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతు పురుగుల శ్యామ్ ప్రభుత్వాన్ని కోరారు.
వంగూరులో ఉరుములతో మోస్తరు వర్షం
వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి, తిరుమలగిరి, గాజర, నిజాంబాద్, సర్వారెడ్డిపల్లి, కిష్టం పల్లి తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి ఆకస్మాత్తుగా ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో మామిడి పండ్లకు తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ అకాల వర్షం వల్ల కోతకు వచ్చిన వరిచేలు దెబ్బతిన్నాయి వర్షంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.
పిడుగుపాటు తాటిచెట్టు దగ్థం
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం ముసలమ్మ చెట్టు గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గ్రామంలోని తాటిచెట్టు పై పిడుగు పడి మంటలు వ్యాపించాయి. పిడుగుపాటుకు ఒక్కసారిగా స్థానికులు భయపడ్డారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్,మోత్కూర్,గుండాల,అడ్డగూడురు మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వడగళ్ల వర్షం వల్ల దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం వడగాలుల తీవ్రత పెరుగుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.మే 2వతేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. బుధవారం రాష్ట్రంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు హీట్ వేవ్ ఏర్పడుతుందని వెదర్ మ్యాన్ తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి - కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, ములుగులో బుధవారం చెదురుమదురుగా ఈదురుగాలులు వీస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. దక్షిణ హైదరాబాద్ లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 2వతేదీ వరకు మొత్తం తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో హీట్‌వేవ్ ప్రభావంతో 43 డిగ్రీల నుంచి 45°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో 41నుంచి 43°C ఉష్ణోగ్రతలతో పొడి వాతావరణం ఏర్పడుతుందన్నారు. మే 3వతేదీ తర్వాత తూర్పు, మధ్య తెలంగాణలో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో వర్షాలు కురుస్తాయని, దీని వల్ల తెలంగాణలో వేడిగాలులు తగ్గుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వివరించారు.
తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ అస్తవ్యస్త వాతావరణం ప్రజలు, ముఖ్యంగా రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రాబోయే రోజుల్లో కూడా హీట్‌వేవ్ ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అదే సమయంలో పిడుగులు, ఈదురుగాలుల ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 3 తర్వాత వర్షాలు పెరిగే అవకాశంతో కొంత ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
Next Story

