ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం..
x

ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కీలక నిర్ణయం..

కొత్త మార్గదర్శకాలతో బదిలీ ప్రక్రియ ప్రారంభం. ప్రాధాన్యత కేటగిరీలు, అర్హత నిబంధనలు స్పష్టీకరణ.


తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. నిషేధాన్ని ఎత్తివేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. జీఓ ఎంఎస్ నం. 38 ప్రకారం మే 1 నుంచి మే 31 వరకు బదిలీలు జరుగనున్నాయి. బదిలీ ఆదేశాలు అందిన మూడు రోజుల్లో ఉద్యోగులు కొత్త స్థానంలో చేరాల్సి ఉంటుంది. అర్హతపై కూడా స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. 2026 జనవరి 1 నాటికి ఒకే స్థానంలో మూడు సంవత్సరాలు పూర్తి చేసినవారు బదిలీకి అర్హులు. అదే సమయంలో నాలుగేళ్లకు మించి ఒకే చోట కొనసాగరాదని నిబంధన పెట్టింది.

భార్యాభర్తల కేసుల్లో ఈ నిబంధన వర్తించదని తెలిపింది. అలాగే 2027 మే 31కి ముందే రిటైర్ అయ్యే ఉద్యోగులను, వారు కోరితే తప్ప బదిలీ చేయరాదని పేర్కొంది. ప్రాధాన్యత కేటగిరీలను కూడా ప్రకటించింది. భార్యాభర్తలు కలిసి ఉండే కేసులు, రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్నవారు, 70 శాతం పైగా వికలాంగత ఉన్నవారికి ముందుగా అవకాశం ఇస్తారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలు ఉన్న ఉద్యోగులు, విధవరాలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా ప్రాధాన్యం ఉంటుంది. క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి కేసులను ప్రత్యేకంగా పరిగణిస్తారు.

ఉద్యోగులు ఐదు ప్రాధాన్య స్థానాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. కష్ట ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేసిన వారికి అదనపు ప్రాధాన్యం ఇస్తారు. బదిలీల ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులు, ఉన్నతాధికారులు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక జూన్ 1 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read More
Next Story