
ఆవేశం నీకు కాదు.. నాకుండాలి హరీష్: స్పీకర్ ప్రసాద్
కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారన్న హరీష్ రావు.
తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు కూడా వాతావరణం వేడెక్కింది. స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపైనే రెండో రోజు కూడా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావుపై స్పీకర్ కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు సభకు బీఆర్ఎస్ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చారు. తమ పార్టీ నేతలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగానే వారు ఈ నల్లబ్యాడ్జీలు ధరించారు. కాగా సభ స్టార్ట్ అయిన తర్వాత.. సోమవారం తమ పార్టీ మహిళా నేతలు సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అవమానించారని హరీష్ రావు తెలిపారు. అంతేకాకుండా ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు తిరిగి తమ నేతలపైనే కేసులు పెట్టారంటూ హరీష్ రావు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ పార్టీ మహిళా నేతలకు జరిగిన అవమానాన్ని రాష్ట్రంలోని యావత్ మహిళలపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. అదే సమయంలో అధికార పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని, గౌరవ సభను కౌరవ సభలా మార్చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆనాడు కౌరవులకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి కూడా పడుతుందంటూ విమర్శలు గుప్పించారు. దాంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెంటనే జోక్యం చేసుకున్నారు. ఎంత ఆగమని చెప్పినా హరీష్ రావు ఆగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళా సభ్యులంటే నాకు ఎంతో గౌరవం ఉంది. మీరు చెప్తే నేను వినడం లేదా.. ఎందుకంత ఆవేశం. ఆవేశం నాకుండాలి.. మీకు కాదు. నా తల్లిని దూషించారు’’ అంటూ స్పీకర్ భావోద్వేగానికి లోనయ్యారు.

