
స్టార్టప్‌లు పెట్టండి.. తెలంగాణలో అవకాశాలు అందుకోండి!
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువత, మహిళలు పరిశ్రమలు స్థాపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు యువత, మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి స్టార్టప్‌లు, కొత్త పరిశ్రమలు స్థాపించాలని సూచించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ హైటెక్స్‌లో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొత్త విధానాలు, చట్టాలు, అభివృద్ధి మార్పులపై యువత అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇలాంటి సదస్సులు వివిధ రంగాల నిపుణుల అనుభవాలను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని చెప్పారు.
భారత్‌కు 2047 కీలకమైన సంవత్సరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి దేశం సాధించిన ప్రగతిని సమీక్షించుకోవడంతో పాటు, భవిష్యత్తు లక్ష్యాల కోసం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం 2025లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసినట్లు సీఎం గుర్తుచేశారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతీయ ఆర్థిక విభాగాలుగా విభజించి, ఆయా ప్రాంతాల వనరులు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని సుమారు 2,100 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ (CURE)గా గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలికి తరలించి, నగరంలో సేవారంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. పరిశ్రమల తరలింపునకు అవసరమైన రాయితీలు, అనుమతులు, సహకారం అందించేందుకు హిల్ట్ పాలసీని తీసుకొచ్చినట్లు వివరించారు.
ఓఆర్‌ఆర్ హైదరాబాద్ అభివృద్ధికి కీలకంగా మారిందని సీఎం అన్నారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో ఐటీ, ఫార్మా, విద్య, సేవారంగాలు విస్తరించాయని చెప్పారు. ఇదే తరహాలో ఓఆర్‌ఆర్ వెలుపల సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో 360 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ఉన్న సుమారు 10,500 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)గా గుర్తించి, తయారీ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలో స్టార్టప్‌లు, కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)గా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు సీఎం తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలంటే పెట్టుబడులు, ప్రణాళికల అమలు కీలకమని పేర్కొన్నారు.
ప్రపంచంలోని ప్రముఖ నగరాలతో పోటీపడే స్థాయికి హైదరాబాద్‌ను తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రేవంత్ రెడ్డి చెప్పారు. భారతీయులు అంతర్జాతీయ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని, అదే సమయంలో సొంతంగా స్టార్టప్‌లు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని యువతకు సూచించారు.
మహిళల భాగస్వామ్యం పెరిగిన దేశాలు ఆర్థికంగా పురోగమిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలోనూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. యువత, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.

