‘నాకు అనుమతివ్వకపోవడం.. తెలంగాణను అవమానించడమే’
x

‘నాకు అనుమతివ్వకపోవడం.. తెలంగాణను అవమానించడమే’

ఇది ముమ్మాటికి తెలంగాణకు జరిగిన అవమానమేనని రేవంత్ రెడ్డి అన్నారు.


తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతిని నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనను అడ్డుకోవటం అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించటమే అని తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. తనను అవమానిస్తున్నామని అనుకున్న కేంద్రం తెలంగాణ ప్రజలను అవమానిస్తోందని అన్నారు. లండన్ పర్యటనను ముగించుకుని సోమవారం ఉదయం రేంవత్ హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం మీడియాతో మాట్లాడుతు, తెలంగాణ అభివృద్ధి కాకూడదన్న ఉద్దేశంతోనే తన అమెరికా పర్యటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అడ్డుకున్నట్లు ఆరోపించారు. వైబ్రంట్ గుజరాత్ పేరుతో గుజరాత్ సీఎంకు అమెరికా, కెనడా పర్యటనకు అనుమతిచ్చిన కేంద్రం తన పర్యటనను ఎందుకు అడ్డుకున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం వైఖరితో మోదీ వివక్ష బయటపడిందని మండిపడ్డారు. ఇదంతా ప్రధాని మోదీ కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వివక్షపూరితమైన ధోరణిని తాము సహించమని, మోదీ వైఖరి ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తోందని అన్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే పార్లమెంట్‌లో లేవనెత్తుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

నాది అధికారిక పర్యటనే

తాను అమెరికాకు వెళ్తానన్నది తన వ్యక్తిగత పర్యటనకు కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారిక పర్యటనకేనని అన్నారు. తనొక్కడే కాదని ఏ ముఖ్యమంత్రి ఏ దేశ పర్యటనకు వెళ్తున్నా విదేశాంగ శాఖ అధికారులు, ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయంలోని సిబ్బంది ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తారని రేవంత్ వివరించారు. అదే పద్దతిలో ఇపుడు కూడా ఇంగ్లాండ్ పర్యటన వివరాలను ఏరోజుకు ఆరోజు రాయబార కార్యాలయం అధికారులు కేంద్రప్రభుత్వానికి రిపోర్టు పంపినట్లు చెప్పారు. తాము విమానం దిగినప్పటి నుంచి మళ్ళీ విమానం ఎక్కే వరకు అన్ని వివరాలను విదేశాంగ శాఖ అధికారులు నోట్ చేసుకుని ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి అందిస్తారని అన్నారు. కానీ తన విషయంలో కావాలనే కేంద్రం పర్యటనకు నిరాకరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం ఈ పర్యటన తలపెట్టాం. వచ్చే డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించే ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలకడానికి, ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలను హైదరాబాద్ ఆహ్వానించాలని ఈ పర్యటన లక్ష్యమని వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, పొటెన్షియల్ పార్ట్‌నర్‌షిప్‌ల కోసం, ముఖ్యంగా విద్య, క్రీడలు, పెట్టుబడులకు సంబంధించిన పర్యటన ఉద్దేశాలను చాలా స్పష్టంగా తెలియజేశామన్నారు.

“లండన్‌ పర్యటనలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్ వారితో చర్చలు జరిపాం. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. వారు కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభించే విషయం పరిశీలిస్తామని చెప్పారు. త్వరలో ఒప్పందాలు చేసుకోబోతున్నాం. అమెరికా, యూకేల్లోని విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తోంది. విదేశీ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌షిప్ అందించి ప్రోత్సహిస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదు. కాబట్టి ఆ వర్సిటీలను ఇక్కడికి ఆహ్వానించడం ద్వారా ఉత్తమమైన విద్యను అందించడానికి వీలవుతుందని ఆలోచన చేశాం’’ అని తెలిపారు రేవంత్ రెడ్డి.

‘‘2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదగాలన్న లక్ష్యం కోసం పర్యటన పెట్టుకుంటే తిరస్కరించడమంటే ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం. ఆక్షేపనీయం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం. డిసెంబర్‌లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌లో పాల్గొనడానికి ఆహ్వానించాలంటే ఆయా సంస్థలు, విద్యాలయాలను నాలుగైదు నెలల ముందే ఆహ్వానాలను అందించాల్సి ఉంటుంది. వారికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ లక్ష్యాలను ఆపలేరు. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కోసం ఆహ్వానాలను అందించడానికి అధికారులను పంపించాం” అని ముఖ్యమంత్రి తెలిపారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే

తన పర్యటనను అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు టాప్ యూనివర్సిటీలను తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తాను ఇంగ్లాండ్, అమెరికా పర్యటనకు సిద్ధమయ్యానని, అదే విషయాన్ని తన అప్లికేషన్‌లో చాలా రోజుల ముందే కేంద్రానికి తెలియజేసినట్లు వివరించారు. కానీ అక్కడ గుజరాత్ సీఎం ఉన్నారని, తాను వెళ్తే తెలంగాణకు ఎక్కడ ప్రాజెక్ట్‌లు వచ్చి గుజరాత్‌కు నష్టం జరుగుతుందో అన్న అభద్రతా భావంతోనే తనకు అనుమతులు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంగ్లాండ్, అమెరికా పర్యటన ఉద్దేశ్యం ఒకటే అయినపుడు అమెరికా పర్యటనను అడ్డుకోవటంలో అర్ధంలేదన్నారు. ఒకవేళ తన అప్లికేషనే తప్పుగా ఉంటే లండన్ పర్యటనకు ఎలా అనుమతించారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన అప్లికేషన్ తప్పుగా ఉంటే రెండు దేశాల పర్యటనకు అనుమతి ఆపాలి కానీ అమెరికా ఒక్కదానికే ఎందకు అనుమతులు ఇవ్వలేదు? అనేది కేంద్రం సమాధానం చెప్పాలి. ఇది ముమ్మాటికి తెలంగాణకు జరిగిన అవమానమేనని రేవంత్ రెడ్డి అన్నారు.

గుజరాత్‌పైనే మోదీ ఫోకస్

తెలంగాణపై ప్రధాని మోదీ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. గుజరాత్‌కు అన్ని విషయాల్లో సహాయం చేస్తున్నారని, కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంలో వెనక్కు లాగుతున్నారని అన్నారు. కేంద్రం, ప్రధాని మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకులేరని రేవంత్ అన్నారు. అమెరికా వెళ్లి తాము తెలంగాణకు ప్రమోట్ చేయకూడదన్న ఆలోచనతోనే మోదీ తన పర్యటనకు అనుమతులు రాకుండా చేశారని రేవంత్ విమర్శించారు. కేంద్రానికి తాను అన్నీ విధాలుగా మద్దతుగా నిలుస్తున్నా ఇంకా మోదీకి తెలంగాణపై ఎందుకింత కక్ష అంటు ప్రశ్నించారు.

కేంద్రం అవలంబిస్తున్న ఈ వైఖరి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని రేవంత్ అన్నారు. అంతేకాకుండా ఈ వైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను చెడగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉండాలని, అప్పుడే అభివృద్ధి జరుగుతుందని రేవంత్ వివరించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

Read More
Next Story