దట్టమైన దండకారణ్యం మంగళవారం ఉదయం ఒక్కసారిగా భద్రతా బలగాల కదలికలతో మార్మోగింది. తెలంగాణ డీజీపీ బి.శివధర్ రెడ్డి, తెలంగాణ అటవీశాఖ అధికారిణి డాక్టర్ సువర్ణ పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా కర్రెగుట్టల ప్రాంతం మొత్తం సాయుధ పోలీసుల పహరాలోకి వెళ్లింది. డ్రోన్ల నిఘా, కేంద్ర బలగాల మోహరింపు మధ్య ఈ పర్యటన కొనసాగుతుండగా, మావోయిస్టుల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
దండకారణ్యంలో సాయుధ పహరా
ములుగు జిల్లాలోని దట్టమైన దండకారణ్యంలో మంగళవారం తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి, అటవీశాఖ అధికారుల పర్యటన నేపథ్యంలో సాయుధ పోలీసు పహరా ఏర్పాటు చేశారు. డీజీపీ పర్యటించిన ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో పోలీసులు నిఘా పెట్టారు. కర్రెగుట్టల ప్రాంతంలో ఎటు చూసినా సాయుధ పోలీసులను మోహరించారు.కర్రెగుట్టల వద్ద ఉన్న ముర్మూరు, పామునూరు బేస్ క్యాంపుల్లో కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి
పామునూరు టు కర్రెగుట్టలు
గతంలో మావోయిస్టుల ఖిల్లాగా పేరొందిన మారుమూల కర్రెగుట్టలను తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి మంగళవారం పర్యటించారు.పామునూరు నుంచి కర్రెగుట్టల కొండల దకా 15 కిలోమీటర్ల దూరం రోడ్డును కేంద్ర పారామిలటరీ పోలీసులు నిర్మించారు. అడవుల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించేందుకు డీజీపీ వెంట తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సువర్ణ కూడా హెలికాప్టరులో వచ్చారు.ఈ రోడ్డు నిర్మాణం వల్ల పర్యావరణానికి కలిగే మార్పులపై అటవీశాఖ అధికారులు పరిశీలించారు. ముర్మూరు నుంచి తడపల బేస్ క్యాంపు వరకు చేపట్టిన రోడ్డు పనులను డీజీపీ పరిశీలించారు. మారుమూల దట్టమైన అటవీప్రాంతమైన కర్రెగుట్టల వద్ద రోడ్డు నిర్మాణం వల్ల శాంతిభద్రతలను పరిరక్షించవచ్చని పోలీసులు చెప్పారు.
తెలంగాణలో 11 మంది మావోయిస్టుల కోసం ఆరా
తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు నేత, మోస్ట్ వాంటెడ్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి కోసం తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు. గణపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం కావడంతో ఆయా గ్రామస్థులు గణపతి లొంగిపోతారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ కగార్ గడువు ముగిసినా గణపతి లొంగిపోలేదు. గణపతితోపాటు పుష్పనూరి నరహరి అలియాస్ సంతోష్, వర్తశేఖర్ అలియాస్ మంగ్తు, జోడే రత్నబాయి అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపిలు ఇంకా అజ్ఝాతంలో కొనసాగుతుండటంతో వారి కోసం తెలంగాణ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉన్న 11 మంది మావోయిస్టులు అడవుల్లో ఉన్నారా? లేదా అర్బన్ షెల్టర్లలో తలదాచుకున్నారా అనే విషయంపై పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి పెట్టాయి. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రూపి అలియాస్ రంగబోయిన భాగ్య ఇంకా అజ్ణాతంలో ఉన్నారు.
కర్రెగుట్టల్లో భద్రతపై సమీక్ష
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన సందర్భంగా ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టల్లో భద్రత గురించి సమీక్షించారు.గతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న కర్రెగుట్టల ప్రాంతంపై తెలంగాణ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.డీజీపీ శివధర్ రెడ్డి భద్రతా బలగాల ఆపరేషన్లపై పోలీసులతో సమీక్ష జరిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులతో డీజీపీ చర్చించారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో భద్రత మరింత బలోపేతం దిశగా డీజీపీ చర్యలు తీసుకున్నారు.
పామునూరు వద్ద పోలీసు అవుట్ పోస్టు
దండకారణ్యంలోని పామునూరు వద్ద తెలంగాణ పోలీసులు అవుట్ పోస్టు నిర్మించనున్నారు.కర్రెగుట్టల్లోని సీఆర్ పీఎఫ్ బేస్ క్యాంపు వద్ద నిర్మించనున్న పోలీసు అవుట్ పోస్టుకు డీజీపీ శివధర్ రెడ్డి భూమి పూజ చేశారు.
కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ప్రమాదం
తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి పర్యనట సందర్భంగా మంగళవారం వెంకటాపురంలో జరిగిన ట్రయల్ రన్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి. పోలీసు కారు అదుపుతప్పి ముందున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు దెబ్బతిన్నాయి.
హెల్మెట్ లేకుండా వాహనాలు టూవీలర్స్ నడపొద్దు : డీజీపీ
హెల్మెట్ ధరించక పోవడం వల్లనే 75 శాతం ద్విచక్రవాహన చోదకులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి చెప్పారు. హెల్మెట్ పెట్టుకోకుండా ద్విచక్రవాహనాలు నడపవద్దని డీజీపీ కోరారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. వెంకటాపురంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా డీజీపీ ప్రజలతో ప్రతిజ్ణ చేయించారు. కార్లు నడిపేటపుడు సీటు బెల్టును విధిగా పెట్టుకోవాలని ఆయన కోరారు.
గుత్తికోయల గూడేల అభివృద్ధి
కర్రెగుట్టల అడవుల్లో గుత్తికోయల గూడేలను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గుత్తికోయల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని అటవీశాఖ అధికారులు హామి ఇచ్చారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కింద గుత్తికోయల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యల గురించి అటవీశాఖ అధికారులు, పోలీసులు చర్చించారు.
దండకారణ్యంలో భద్రతా చర్యలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించడం గమనార్హం. ఒకవైపు మావోయిస్టుల కదలికలను కట్టడి చేయడంపై పోలీసులు దృష్టి పెట్టగా, మరోవైపు గుత్తికోయల గూడేల అభ్యున్నతికి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.