దసరా పండుగకు తెలంగాణలో డబ్బుల వరద..
x

దసరా పండుగకు తెలంగాణలో డబ్బుల వరద..

సామాన్యుడికి ధరల మంట.. సంపన్నుడికి డిస్కౌంట్ల పంట!


తెలంగాణలో దసరా పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ సంబరాలు. దసరా సందడి. కొత్త బట్టలు, బంగారం, వాహనాల కొనుగోళ్లు. నాన్‌వెజ్‌ విందులు, పిండి వంటలు. అయితే ఈసారి పండుగ ఖర్చులు సామాన్యులకు భారంగా మారాయి. నాటుకోడి ధరలు మటన్‌తో పోటీ పడుతుండగా, బియ్యం, చక్కెర, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా పెరగడంతో పండుగ బడ్జెట్‌ తలకిందులైంది.

దసరా సీజన్‌లో తెలంగాణలో దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌, బంగారం, వాహనాలు, ఆహార పదార్థాలు, ప్రయాణాలు, ఇతర కొనుగోళ్లపై భారీగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పండుగ సంబంధిత వ్యయం రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు ఉండవచ్చని ప్ర‌ముఖ చార్టెడ్ అకౌంటెంట్ పొన్నె బాల‌స్వామి చెప్పారు.

దసరా వచ్చిందంటే చాలామంది ఇళ్లలో నాన్‌వెజ్‌ విందులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో నాటుకోళ్లు, మేకలు, గొర్రెలకు డిమాండ్ పెరిగింది. ఈసారి నాటుకోడి ధరలు వినియోగదారులకు షాక్ ఇచ్చింది. హైద‌రాబాద్‌లోని మార్కెట్ ల‌లో నాటుకోడి లైవ్‌ ధర కిలో రూ.850 నుంచి రూ.1200 వరకు పలికింది. కోడి పుంజు పరిమాణాన్ని బట్టి ధర... శుభ్రం చేసిన మాంసం ధర కిలో రూ.1,300 చేరింది. మరోవైపు మటన్‌ ధరలు కొన్ని మార్కెట్లలో కిలో రూ.950 నుంచి రూ.1400 మధ్య ఉన్నాయి.

ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడాలున్నప్పటికీ, కొన్ని చోట్ల నాటుకోడి ధర మటన్‌ను మించిపోయిందని మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. సరఫరా తక్కువగా ఉండటం, పండుగ సమయంలో డిమాండ్‌ పెరగడం ధరల పెరుగుదలకు కారణాలుగా వ్యాపారులు చెప్పారు. వైరల్‌ వ్యాధుల కారణంగా కోళ్లు చనిపోవడం కూడా సరఫరాపై ప్రభావం చూపింది.

పిండి వంటల ధరలూ పైపైకి!

దసరా సందర్భంగా ఇళ్లలో అరిసెలు, లడ్డూలు, గారెలు తదితర పిండి వంటలు తయారు చేస్తారు. అయితే ఈసారి వాటి తయారీ ఖర్చు పెరిగింది. చక్కెర, బియ్యం, పప్పులు, నూనెలు, ఇతర ముడిసరుకుల ధరలు పెరగడంతో పండుగ వంటకాల ధరలపైనా ప్రభావం పడింది.

తెలంగాణలో అక్టోబర్‌ నెలలో కిలో సన్న బియ్యం ధర కొన్ని మార్కెట్లలో రూ.80 నుంచి రూ.82 వరకు చేరింది. హైదరాబాద్‌లో కొన్ని రకాల సన్న బియ్యం ధరలు కిలోకు రూ.85 నుంచి రూ.90 వరకు పలికాయి. సెప్టెంబర్‌లో కిలో చక్కెర ధర రూ.46–48 ఉండగా, అక్టోబర్‌ మధ్య నాటికి హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.53–55కు చేరింది. కందిపప్పు, పెసరపప్పు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా పెరిగాయి. దీంతో పిండి వంటల తయారీ ఖర్చు పెరిగింది. అరిసెలు, లడ్డూలు, గారెల వంటి వంటకాల ధరలు కిలోకు రూ.80 నుంచి రూ.150 వరకు పెరిగినట్లు ప్ర‌జ‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం క‌నిపించింది. అయితే వంటకం, నాణ్యత, ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులున్నాయి.

ప్రయాణాలు, షాపింగ్‌పైనా భారీ ఖర్చుదసరా సెలవులకు హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పండుగ సమయంలో ప్రయాణాల కోసం ప్రజలు చేసే ఖర్చు కూడా కుటుంబాల బడ్జెట్‌పై ప్రభావం చూపింది.

మరోవైపు కొత్త దుస్తులు, బంగారం, ఎలక్ట్రానిక్స్‌, వాహనాల కొనుగోళ్లతో మార్కెట్లలో సందడి నెలకొంది. ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయగా, మధ్యతరగతి, పేద కుటుంబాలు మాత్రం పెరిగిన ధరల మధ్య ఖర్చులను సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది.

ధరలు పెరిగినా తగ్గని పండుగ సందడి

ఒకవైపు నాటుకోడి, మటన్‌ ధరలు.. మరోవైపు బియ్యం, చక్కెర, పప్పులు, పిండి వంటకాల ధరలు పెరిగినా తెలంగాణలో దసరా సందడి తగ్గలేదు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ వంటకాలు, నాన్‌వెజ్‌ విందులు, కొత్త దుస్తులు, కొనుగోళ్లతో పండుగ వాతావరణం నెలకొంది. మొత్తానికి, తెలంగాణలో దసరా పండుగ ప్రజలకు ఆనందాన్ని పంచగా, పెరిగిన ధరలు మాత్రం కుటుంబాల జేబులకు భారంగా మారాయి.

మొత్తంగా చూస్తే.. పండుగ సంబరాలు అందరివే అయినా, ఖర్చుల భారం మాత్రం అందరికీ ఒకేలా లేదు. నిత్యావసరాల ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలు బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకుంటుంటే.. బంగారం, వాహనాలపై రాయితీలు కొనుగోలు చేయగలిగిన వర్గాలకు ఊరటనిస్తున్నాయి. పండుగ పేరుతో పెరిగే ఖర్చులు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతుంటే.. ఈ దసరా నిజంగా అందరికీ సంతోషాన్ని పంచిందా? లేక కొందరికే కొనుగోళ్ల పండుగగా మిగిలిందా?

Read More
Next Story